కిషన్ రెడ్డి గారు.. సింగరేణి కార్మికులకు ఆ గిఫ్ట్ ఇవ్వండి: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ డిమాండ్

సింగరేణి బీజేపీ భరోసా పేరుతో పెద్దపెల్లి జిల్లాకు వస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సింగరేణి కార్మికులకు ఓ గిఫ్ట్ ఇవ్వాలన్నారు ఎంపీ వంశీకృష్ణ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటించారు. సింగరేణి అధికారులతో కలిసి తాడిచెర్ల కోల్ బ్లాక్ మైన్-2 ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఎంపీ… మైనింగ్ వల్ల ఎన్ని గ్రామాలు ప్రభావితమవుతున్నాయి? ఎంతమంది భూములు కోల్పోతున్నారు? అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ… పెద్దపల్లి జిల్లాకు వస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కేవలం పర్యటనలకే పరిమితం కాకుండా సింగరేణి కార్మికులకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాడిచెర్ల మైన్ పేరిట రాజకీయాలు చేయొద్దని… దీనికి సంబంధించిన పర్యావరణ అనుమతులను కేంద్రం నుండి త్వరగా తీసుకువచ్చి, వచ్చే మూడు నెలల్లోనే మైన్ పనులు ప్రారంభమయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మైన్ ప్రారంభమైతే ఏకంగా 50 వేల కోట్ల రూపాయల టర్నోవర్ పెరుగుతుందని… ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందడంతో పాటు స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వంశీకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, తాడిచెర్ల మైన్ వేదికగానే సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచుతున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టమైన హామీ ఇవ్వాలని వంశీకృష్ణ డిమాండ్ చేశారు.