July 11, 2026

Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య

Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
Reading Time: 2 minutes
Vietnam Ha Long Bay Boat Accident 19 Telugu Tourists Killed

వియత్నాంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఫు క్వాక్ ద్వీపం సమీపంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న బోటు ఒక్కసారిగా తీవ్రమైన అలలకు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 19 మంది తెలుగు పర్యాటకులు జలసమాధి అయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన సహాయ బృందాలు రక్షణ చర్యలు చేపట్టారు. స్థానిక అధికారులతో కలిసి నేవీ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 11: 30 గంటలకు బోటు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఓ మొబైల్ కంపెనీ తరపున డీలర్స్ టూరిస్ట్‌లుగా వెళ్లారు. ఏపీ నుంచి 30, తెలంగాణ నుంచి 45 మంది వెళ్లారు.

ఇక మృతుల వివరాల కోసం అధికారులు హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాలు కంట్రోల్ రూమ్‌లను సంప్రదించవచ్చు: +84 36 281 7930, +84 91 552 37 14, +84 33 452 0414. హనోయిలోని రెండవ కంట్రోల్ రూమ్‌ను +84 91 308 9165 నంబర్‌తో సంప్రదించవచ్చు. ఎలాంటి సహాయానికైనా, సందేహాలకైనా తాము అందుబాటులో ఉన్నామని భారత మిషన్ తెలిపింది.

మొత్తం బోటులో 75 మంది భారతీయులు ఉండగా.. ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు చెందినవారు, తమిళనాడు వాసులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే వారి పూర్తి వివరాలు, స్వస్థలాలు, కుటుంబ సభ్యుల సమాచారం సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారత రాయబార కార్యాలయం కూడా వియత్నాం అధికారులతో సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. బోటు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులా, సాంకేతిక లోపమా, లేక మరే ఇతర కారణమా అన్న కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.

ఈ విషాద ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లోని బంధువులు, స్నేహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.