July 11, 2026

S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల

S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
Reading Time: < 1 minute
S Janaki Passes Away Telugu Pride Legendary Playback Singer

S Janaki: భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ గాయని ఎస్.జానకి తెలుగు రాష్ట్రాల గర్వకారణం. 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు ఆమె జన్మించారు. జానకి తండ్రి ఉపాధ్యాయుడిగా, ఆయుర్వేద వైద్యుడిగా సేవలందించారు. ఆ సమయంలో ఆయన ఉద్యోగరీత్యా కుటుంబం కొంతకాలం కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో నివసించింది. చిన్ననాటి నుంచే సంగీతంపై అసాధారణమైన ఆసక్తి కనబరిచిన జానకి మూడేళ్ల వయసులోనే వేదికలపై పాటలు పాడడం ప్రారంభించారు. సంగీత విద్వాంసుల వద్ద శిక్షణ పొందుతూ తన గాన ప్రతిభను మరింత మెరుగుపరుచుకున్నారు. ముఖ్యంగా నాదస్వర విద్వాంసుడు పైడిస్వామి వద్ద సంగీతంలో ప్రావీణ్యం సంపాదించారు.

సినీ సంగీతం పట్ల ప్రత్యేకమైన అభిరుచి కలిగిన జానకి, లతా మంగేష్కర్, పి.సుశీల, జిక్కి, పి.లీల వంటి దిగ్గజ గాయనులు ఆలపించిన పాటలను వివిధ కార్యక్రమాల్లో ఆలపిస్తూ అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆమె గాత్రంలోని మాధుర్యం అప్పుడే ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 19 ఏళ్ల వయసులో తన మామయ్య సూచన మేరకు చెన్నై చేరుకున్న జానకి, ప్రముఖ ఏవీఎం (AVM) స్టూడియోలో గాన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ అవకాశమే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అనంతరం చెన్నైని కేంద్రంగా చేసుకుని వేలాది పాటలు ఆలపిస్తూ దక్షిణ భారతంతో పాటు దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన గాయనిగా ఎదిగారు. తన అపూర్వ గానంతో కోట్లాది మంది సంగీతాభిమానుల హృదయాల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసిన గానకోకిలగా ఎస్.జానకి ఈ రోజు గుండెపోటుతో మరణించారు. ఆమె మన మధ్య లేకపోయినా తన గాత్రంతో చిరస్మరణీయంగా నిలిచిపోతారు.