జానకమ్మ మరణం నన్ను ఎంతో కలచివేసింది.. సంగీత ప్రపంచంలో ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయాం: మెగాస్టార్ చిరు

హైదరాబాద్: సుప్రసిద్ధ గాయని ఎస్.జానకి మృతికి మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన ట్వీట్ చేశారు. జానకమ్మ మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసిందని భావోద్వేగానికి గురయ్యారు. ‘‘నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే.
నా కెరీర్‌లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ, ఆ రోజులు.. ఆ జ్ఞాపకాలు.. మళ్లీ కళ్లముందు సజీవంగా నిలుస్తాయి. జానకమ్మ ఒక గాయని మాత్రమే కాదు.. భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం.. ఒక అనుభూతి.. ఒక జీవితకాలపు అనుబంధం.
ఈ రోజు మనం సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయాం. కానీ ఆమె గానం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా, మన జీవితాలకు నేపథ్య సంగీతంగా చిరకాలం మార్మోగుతూనే ఉంటుంది. జానకమ్మ కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, ఆమెను అభిమానించే కోట్లాది సంగీతాభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. జానకమ్మ.. మీ స్వరం ఎప్పటికీ అమరం’’ అని చిరు పేర్కొన్నారు.
లెజెండరీ సింగర్ జానకి కన్నుమూత:
సినీ సంగీత పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. లెజెండరీ సింగర్ ఎస్. జానకి కన్నుమూశారు. గతకొంత కాలంగా వయోభారం, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతోన్న ఆమె ప్రస్తుతం మైసూర్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం (జులై 11) ఆరోగ్యం విషమించడంతో ఆమె తుదిశ్వాస విడిచారు.
జానకి మనువరాలు అప్సర వైద్యుల ఇన్స్‌స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని ధృవీకరించారు. దీంతో భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. తన అద్భుతమైన స్వరంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న గాన కోకిల జానకి మరణంపై పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది.
నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే.
నా కెరీర్‌లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ గారి… pic.twitter.com/yTXS3NKkbk
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 11, 2026