July 11, 2026

KTR: 117 సీట్లు కాదు.. కాంగ్రెస్‌కు 7 సీట్లు కూడా రావు.! కాంగ్రెస్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..

KTR: 117 సీట్లు కాదు.. కాంగ్రెస్‌కు 7 సీట్లు కూడా రావు.! కాంగ్రెస్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..
Reading Time: 2 minutes
Ktr Slams Congress Not 117 Seats Congress Wont Even Win 7 Targets Revanth Reddy

KTR: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలో నీటి నిర్వహణ, రైతుల పరిస్థితి, కాళేశ్వరం ప్రాజెక్టు, రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మాట్లాడేది రాజకీయ అంశాలపై కాదని, పూర్తిగా రైతుల ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లలో ప్రస్తుతం కేవలం 23% మాత్రమే నీరు ఉందని, మిగిలిన 77% సామర్థ్యం ఖాళీగా ఉందని పేర్కొన్నారు.

రిటైర్డ్ ఇంజినీర్లు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసి కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి మేడిగడ్డతో సంబంధం లేకుండా నీటిని ఎత్తిపోయవచ్చని సూచించారని కేటీఆర్ తెలిపారు. రోజుకు 2 టీఎంసీల చొప్పున 100 రోజుల పాటు నీటిని లిఫ్ట్ చేస్తే సుమారు 200 టీఎంసీల నీటితో గోదావరి బేసిన్‌ను సస్యశ్యామలం చేయవచ్చని వారు సూచించారని చెప్పారు. అయితే ఈ సూచనలను అమలు చేయకుండా సీఎం భేషజాలకు పోతున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి ప్రకృతి వల్ల వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఏర్పడిన కరువని కేటీఆర్ విమర్శించారు. కన్నెపల్లి వద్ద లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. భద్రాచలం మునిగిపోతుందనే కారణంతో నీటిని ఎత్తిపోకుండా ఉండటం అర్థరహితమని వ్యాఖ్యానించారు. 2022లో గోదావరిలో భారీ వరదలు వచ్చినప్పటికీ మేడిగడ్డకు, భద్రాచలానికి ఎలాంటి నష్టం జరగలేదని గుర్తుచేశారు. రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ కక్షలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.

బీఆర్ఎస్‌పై కోపం ఉంటే కేసులు పెట్టాలని, విమర్శించాలని, కానీ రైతులపై ప్రతీకారం తీర్చుకోవద్దని కేటీఆర్ అన్నారు. రైతులను ఎండబెట్టి ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలను కూడా ఆయన ఖండించారు. సీఎం ఒకవైపు సర్వేలు నిర్వహిస్తూనే మరోవైపు 117 స్థానాలు గెలుస్తామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తమకు అందిన సమాచారం ప్రకారం సీఎం నిర్వహించిన సర్వేల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్‌కు 78కిపైగా స్థానాలు వస్తాయని తేలిందన్నారు. మరో 4 సర్వేల్లో కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని నివేదికలు వచ్చాయని పేర్కొన్నారు.

హరీశ్ రావుపై తరచూ వస్తున్న పుకార్లను కేటీఆర్ ఖండించారు. హరీశ్ రావు నికార్సైన నాయకుడని, కేసీఆర్ తయారు చేసిన సైనికుడని కొనియాడారు. పార్టీ మార్పుల గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదని, ఆయన ఇప్పటికే పలుమార్లు పార్టీలు మారారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ తన పార్టీ ఖాతాలో ఉన్న నిధుల నుంచి ఆర్థిక సహాయం అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కాంగ్రెస్ పాత్రపై కూడా విమర్శలు గుప్పించారు. చివరగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు 117 స్థానాలు కాదు, ఏకంగా 7 స్థానాలు కూడా రావని కేటీఆర్ వ్యాఖ్యానించారు.