July 11, 2026

ఆ దేవుడికి ప్రసాదం కిచిడీ.. టమాటా, ఆలూ లేకుండా ఎందుకు వండుతారో తెలుసా

ఆ దేవుడికి ప్రసాదం కిచిడీ.. టమాటా, ఆలూ లేకుండా ఎందుకు వండుతారో తెలుసా
Reading Time: 2 minutes

ఆ దేవుడికి ప్రసాదం కిచిడీ.. టమాటా, ఆలూ లేకుండా ఎందుకు వండుతారో తెలుసా

Caption of Image.

ప్రతిరోజూ ఉదయం పూరీ జగన్నాథ స్వామికి పెట్టే మొదటి ప్రసాదం (నైవేద్యం) సాదా కిచిడీ. విశ్వమంతటికీ అధిపతి అయిన ఆ దేవుడికి ఇంత సాదాసీదా భోజనాన్ని ఎందుకు పెడతారో తెలుసా..? దీని వెనుక ఒక భక్తురాలికి, భగవంతునికి మధ్య ఉన్న అమూల్యమైన ప్రేమ కథ ఉంది.

అమాయక భక్తురాలు
చాలా కాలం క్రితం, పూరీ జగన్నాథుని ఆలయం దగ్గర ఒక చిన్న గుడిసెలో మాతా కర్మబాయి అనే గొప్ప భక్తురాలు ఉండేది. ఆమె శ్రీకృష్ణుడి (జగన్నాథుడి) బాల రూపాన్ని తన సొంత కొడుకులా భావించేది. నిజంగా తన కొడుకు తన ఇంట్లోనే ఉన్నట్లుగా రోజూ దేవుడితో మాట్లాడేది. ఆమె నిష్కల్మషమైన ప్రేమకు ఆ దేవుడు కూడా దాసుడయ్యాడు.

దేవుడు మొదటిసారి తిన్నప్పుడు…
ఒకరోజు, కర్మబాయి తన బాలకృష్ణుడికి పండ్లు కాకుండా, తానే స్వయంగా వండిన వేడివేడి అన్నం పెట్టాలనుకుంది. స్వామితో ఆ విషయం చెప్పగా, దేవుడు చిరునవ్వుతో “అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది, త్వరగా పెట్టు” అన్నాడు.

ఆమె వెంటనే బియ్యం, పప్పుతో ఒక సాదా కిచిడీని చేసి వడ్డించింది. ఆ వేడి కిచిడీ తింటుంటే ఎక్కడ నోరు కాలుతుందో అని భయపడి, కర్మబాయి ప్రేమతో స్వామికి విసనకర్రతో విసరడం ప్రారంభించింది. ఆ కిచిడీ స్వామికి ఎంతగా నచ్చిందంటే, “అమ్మా, ఇది చాలా బాగుంది. నాకు రోజూ ఉదయాన్నే ఇదే కిచిడీ చేసి పెట్టు” అని అడిగాడు. అప్పటి నుండి రోజూ ఉదయం లేవగానే ఎలాంటి ఆర్భాటాలు లేకుండా కర్మబాయి కిచిడీ వండేది, దేవుడు కూడా చిన్నపిల్లాడిలా పరుగెత్తుకుంటూ వచ్చి తినేవాడు.

ఆలయంలో కిచిడీ ప్రసాదం
కొన్నాళ్లకు కర్మబాయి వృద్ధాప్యంతో మరణించింది. తన తల్లి లాంటి భక్తురాలు దూరమవడంతో జగన్నాథ స్వామి కన్నీరుమున్నీరయ్యాడు. ఉదయాన్నే పూజారి ఆలయ తలుపులు తీసేసరికి, విగ్రహం కళ్ల నుండి నీళ్లు కారడం చూసి ఆశ్చర్యపోయాడు. పూజారి బాధతో కారణం అడగగా, స్వామి ఇలా అన్నారు.. “పూజారిగారూ, ఈ రోజు నా తల్లి (కర్మబాయి) చనిపోయింది. ఇకపై రోజూ ఉదయం నాకు అంత ప్రేమతో కిచిడీ ఎవరు తినిపిస్తారు ?” అని ఏడ్చారు.

భగవంతుని ప్రేమను చూసి పూజారి కరిగిపోయాడు. ఆయన స్వామితో, “స్వామీ! మీకు ఆ లోటు రానివ్వం. ఈ రోజు నుండి ప్రతిరోజూ ఉదయం ఈ ఆలయంలో మీకు పెట్టే మొదటి నైవేద్యం ఈ కిచిడీయే అవుతుంది” అని మాట ఇచ్చాడు. అలా కర్మబాయి చనిపోయినా, ఆమె జ్ఞాపకార్థం ఇప్పటికీ పూరీలో ఉదయాన్నే కిచిడీ ప్రసాదాన్ని పెడుతున్నారు.

జగన్నాథుని కిచిడీ ప్రత్యేకతలు:
కూరగాయలు ఎందుకు వాడరు అంటే.. కర్మబాయి నైవేద్యం వండినప్పుడు ఇంట్లో ఏముంటే దాంతోనే సాదాగా చేసింది. అందుకని ఇప్పటికీ ఈ కిచిడీలో కేవలం బియ్యం, పెసరపప్పు, స్వచ్ఛమైన నెయ్యి, కొన్ని ప్రత్యేక మసాలాలు మాత్రమే వేస్తారు. బంగాళాదుంపలు, టమోటాలు, కాలీఫ్లవర్ వంటి కూరగాయలను అస్సలు వాడరు. ఈ ప్రసాదాన్ని ఆలయ వంటగదిలో వండుతున్నప్పుడు, ఆ సువాసన చుట్టుపక్కల ప్రాంతమంతా వ్యాపిస్తుంది.

  ఈ కిచిడీని మొదట జగన్నాథునికి పెట్టి, ఆ తర్వాత ‘విమలా దేవి’ అమ్మవారి ముందు ఉంచుతారు. అప్పుడే ఇది ‘మహాప్రసాదం’గా మారుతుంది. ఆలయానికి ఎన్ని లక్షల మంది భక్తులు వచ్చినా ఈ ప్రసాదం అస్సలు తరిగిపోదు, అలాగని వృథా కూడా కాదు. ఆలయం మూసే సమయానికి కరెక్ట్‌గా ప్రసాదం పూర్తయిపోతుంది. భగవంతుడు కేవలం భక్తికి, ప్రేమకు మాత్రమే లొంగుతాడనడానికి ఈ కిచిడీ ప్రసాదమే ఒక గొప్ప ఉదాహరణ!

©️ VIL Media Pvt Ltd.