స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు గట్టి షాక్.. కుళ్ళిన గుడ్లు, పాడైన వస్తువుల డెలివరీ.. ఒకేసారి 9 నోటీసులు ఇచ్చిన FSSAI

ఆన్‌లైన్ డెలివరీ చేసే ప్రముఖ సంస్థ ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్’ కు భారత ఆహార భద్రతా సంస్థ (FSSAI) నోటీసులు జారీ చేసింది. కస్టమర్ల నుంచి వచ్చిన చాల ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మొత్తం 9 నోటీసులను జారీ చేసింది.
ఇన్‌స్టామార్ట్ ద్వారా ఆర్డర్ చేసినప్పుడు గడువు ముగిసిపోయిన (Expired), పాడైపోయిన, కుళ్ళిపోయిన, ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలు వస్తున్నాయని చాలా మంది కస్టమర్లు ఫిర్యాదులు చేశారు. కంపెనీకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో కస్టమర్లు ఆహార భద్రతా అధికారులను ఆశ్రయించారు.
దీనిపై స్పందించిన FSSAI.. ఈ లోపాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని స్విగ్గీని ఆదేశించింది. ఒకవేళ సరైన సమాధానం ఇవ్వకపోతే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
కస్టమర్లు చేసిన ఫిర్యాదులు ఇవే:
కుళ్ళిన గుడ్లు: ‘అక్షయకల్ప ఆర్గానిక్ ఎగ్స్’ ఆర్డర్ చేస్తే.. అవి గడువు ముగిసిపోయి, కుళ్ళిపోయి, విపరీతమైన దుర్వాసనతో వచ్చాయి. ఇవి అస్సలు తినడానికి పనికిరావని తేలింది.
ఎక్స్‌పైరీ డేట్ దాటిన ప్రొడక్ట్స్: ‘హెల్తిఫై వే ప్రోటీన్’ (Weigh Protein), అలాగే ‘మద్రాస్ మిక్చర్’ వంటి తినుబండారాలు వాటి గడువు తేదీ (Expiry Date) అయిపోయిన తర్వాత కూడా కస్టమర్లకు డెలివరీ చేశారు.
పాడైపోయిన పరాఠాలు: ‘కాక్కె దా పరాఠా’ అనే ఫుడ్ ఐటమ్ పూర్తిగా పాడైపోయి, వాసన వస్తూ, తినడానికి వీల్లేని స్థితిలో డెలివరీ అయ్యింది.
బేబీ ఫుడ్‌లో నిర్లక్ష్యం: చిన్న పిల్లలు తినే ఒక ఆహారం (Baby Food) సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్ల పాడైపోయింది. కస్టమర్ ఆ పాడైపోయిన ఆహారంని రిటర్న్ చేసినా, కంపెనీ మళ్లీ అదే పాడైపోయిన ఆహారంని పంపించడం గమనార్హం.
నకిలీ లైసెన్స్ నంబర్లు: కొన్ని ఫుడ్ ఐటమ్స్ ప్యాకెట్లపై తప్పుగా, చెల్లని లేదా అస్సలు వాడుకలోనే లేని FSSAI లైసెన్స్ నంబర్లను వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. రిజిస్ట్రేషన్‌లో ఉన్న పేర్లకు, అమ్ముతున్న పేర్లకు సంబంధం లేదని తేలింది.
FSSAI డిమాండ్
ఈ వ్యవహారంపై తగిన ఆధారాలతో పూర్తి వివరణ ఇవ్వాలని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ను అధికారులు ఆదేశించారు. మీ వస్తువుల నాణ్యత ఎలా ఉంచుతారు ? స్టాక్‌ను ఎలా మేనేజ్ చేస్తారు ? వస్తువులను నిల్వ చేసే చోట పరిశుభ్రత ఎలా ఉంటుంది ? అనే వివరాలన్నింటినీ తమకు సమర్పించాలని స్పష్టం చేశారు.