July 12, 2026

S Janaki: పెళ్లి.. పిల్లలు.. వేల పాటలు.. ఎస్.జానకి జీవితంలో తెలియని విశేషాలు!

S Janaki: పెళ్లి.. పిల్లలు.. వేల పాటలు.. ఎస్.జానకి జీవితంలో తెలియని విశేషాలు!
Reading Time: 2 minutes
Singer S Janaki Personal Life Husband Son Career Biography

S Janaki: గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు ఎస్.జానకి జన్మించారు. 19 ఏళ్ల వయసులో తన మామయ్య సూచన మేరకు చెన్నై చేరుకున్న జానకి, ప్రముఖ ఏవీఎం (AVM) స్టూడియోలో గాన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె – వి.రామ్‌ప్రసాద్‌ను వివాహం చేసుకుని చెన్నైలో స్థిరపడ్డారు. ఈ దంపతులకు మురళీకృష్ణ అనే కుమారుడు ఉన్నారు. భరతనాట్యంలో ప్రావీణ్యం పొందిన మురళీకృష్ణ తెలుగు, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. తెలుగులో వినాయకుడు, మల్లెపువ్వు చిత్రాల ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఆయన 2026 జనవరి 22న తన 65 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అంతకుముందే తన తండ్రి రామ్‌ప్రసాద్ కూడా 1990లలో మరణించారు.

జానకి సినీ ప్రస్థానం ఏవీఎం

జానకి సినీ ప్రస్థానం ఏవీఎం (AVM) స్టూడియోలో గాయనిగా ప్రారంభమైంది. 1957లో టి.చలపతిరావు సంగీత దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘విధియిన్ విలాయట్టు’ ద్వారా ఆమె సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అనంతరం ‘ఎమ్మెల్యే’ చిత్రంలోని పాటతో తెలుగు ప్రేక్షకులకు చేరువై, తన ప్రత్యేక గాత్రంతో గుర్తింపు పొందారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు పలు భారతీయ భాషల్లో వేలాది పాటలు పాడి భారతీయ సినీ సంగీతంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని సుస్థిరం చేసుకున్నారు. నేపథ్య గాయనిగానే కాకుండా పాటల రచయిత్రి, కర్ణాటక సంగీత విద్వాంసురాలు, సంగీత దర్శకురాలిగానూ జానకి తన ప్రతిభను చాటుకున్నారు. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన ‘మౌన పోరాటం’ చిత్రానికి సంగీతం అందించి, భానుమతి, లీల తర్వాత సంగీత దర్శకురాలిగా గుర్తింపు పొందిన అరుదైన మహిళల్లో ఒకరిగా నిలిచారు. శ్రీకృష్ణుడు, షిర్డీ సాయిబాబాపై అపార భక్తి కలిగిన ఆమె భక్తి గీతాల ఆల్బమ్‌లను కూడా రిలీజ్ చేశారు.

తన గాత్ర వైవిధ్యం జానకిని ఇతర గాయనుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టింది. ఒకే పాటలో చిన్నారి, వృద్ధురాలు, యువతి వంటి విభిన్న స్వరాలను పలికిస్తూ మిమిక్రీని తన గానంలో మేళవించిన ఆమె ప్రతిభ ప్రేక్షకులను విస్మయానికి గురిచేసింది. భావోద్వేగం, ప్రేమ, ఆవేదన, అల్లరి, భక్తి.. ఏ భావాన్నైనా తన స్వరంతో అద్భుతంగా ఆవిష్కరించగల అరుదైన గాయని ఆమె. సుమారు 55 ఏళ్లపాటు సాగిన తన గాన ప్రస్థానంలో ఐదు నుంచి ఆరు తరాల కథానాయికలకు నేపథ్య గానం చేసిన ఎస్.జానకి, వేలాది పాటలతో సంగీతాభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీ, బెంగాలీ, ఒడియా, సంస్కృతం, తుళు, సింహళం, జపనీస్, జర్మన్ తదితర భాషలపై పట్టు సాధించి ఆయా భాషల్లో పాటలు పాడారు. ఆమె, ఘంటసాల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.జె. యేసుదాస్, పి.సుశీల, వాణి జయరాం, కె.ఎస్.చిత్ర, ఇళయరాజా వంటి సంగీత దిగ్గజాలతో కలిసి ఎన్నో చిరస్మరణీయ గీతాలను ఆలపించారు. ఆమె గాత్రం భారతీయ సంగీత ప్రపంచంలో ఎప్పటికీ చెరగని మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఈ రోజు ఆమె మన మధ్య లేకపోయినా తన గాత్రంతో జనాల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారు.