July 12, 2026

దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు.. జూలై 17న పట్టాలెక్కనుందా!

దేశంలోనే  తొలి హైడ్రోజన్ రైలు.. జూలై 17న పట్టాలెక్కనుందా!
Reading Time: < 1 minute

దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు.. జూలై 17న పట్టాలెక్కనుందా!

Caption of Image.

భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టానికి తెరలేవనుంది. దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును జూలై 17న ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా హర్యానాలోని జింద్ నుంచి ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. 

తొలిసారి ఈ రైలు జింద్-సోనిపత్ మార్గంలో పైలట్ ప్రాజెక్టుగా నడవనుంది. 89 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ రైలు రోజుకు రెండు రౌండ్ ట్రిప్పులు చేస్తూ మొత్తం 356 కిలోమీటర్లు ప్రయాణించనుంది. ఇందులో 682 సీట్లు ఉండగా, రోజుకు సుమారు 2వేల600 మంది ప్రయాణికులను తరలించే కెపాసిటీ ఉంది.

ఈ రైలు ప్రత్యేకత ఏమిటంటే.. ఇది డీజిల్‌తో కాకుండా 1,200 కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ద్వారా నడుస్తుంది. హైడ్రోజన్, ఆక్సిజన్‌తో చర్య జరిపి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆ విద్యుత్తుతో రైలు మోటార్లు పనిచేస్తాయి. హైడ్రోజన్ తో నడిచే ఈ రైలు ద్వారా ఎటువంటి కాలుష్యం ఉండదు. నీటి ఆవిరి మాత్రమే బయటకు వస్తుంది. అందుకే హైడ్రోజన్ రైళ్లను పర్యావరణహిత రవాణా వ్యవస్థగా భావిస్తున్నారు.

ఈ రైలు గంటకు గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అయితే ఇది పైలట్ ప్రాజెక్ట్ కావడంతో ప్రారంభ దశలో భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా వేగాన్ని నిర్ణయిస్తారు. ఈ ప్రాజెక్టు కోసం భారతీయ రైల్వే రూ.111.83 కోట్లు ఖర్చు చేసింది.

ప్రస్తుతం ఈ రైలు హర్యానాలోనే నడిచినా, భవిష్యత్తులో హైడ్రోజన్ రైళ్లను దేశంలోని ఇతర మార్గాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. కాలుష్యాన్ని తగ్గిస్తూ, స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని పెంచే దిశగా ఇది భారతీయ రైల్వేకు ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.