July 12, 2026

Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం

Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
Reading Time: 2 minutes
Gujarat Girnar Lion Attack Boy Killed Pilgrimage Hill Junagadh

గుజరాత్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. భక్తుల కళ్ల ముందే 11 ఏళ్ల బాలుడిని సింహం అడవిలోకి ఈడ్చుకెళ్లిన అత్యంత దారుణంగా చంపేసింది. దీంతో భక్తులంతా భయాందోళనకు గురయ్యారు. కళ్లెదుటే ఘోరం జరగడంతో ఆందోళన చెందారు.

గుజరాత్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం గిర్నార్ కొండపై తెల్లవారుజామున ఘోర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ దర్శనానికి వెళ్తున్న 11 ఏళ్ల బాలుడిపై సింహం ఒక్కసారిగా దాడి చేసి అడవిలోకి ఈడ్చుకెళ్లి చంపేసింది. ఈ ఘటనతో అక్కడ ఉన్న వందలాది మంది భక్తులు భయాందోళనలకు గురయ్యారు.

భక్తుల సమక్షంలోనే దాడి

అధికారుల వివరాల ప్రకారం.. ఈ ఘటన ఉదయం సుమారు 5.45 గంటలకు గిర్నార్ కొండపై ఉన్న యాత్రా మార్గంలోని 50వ మెట్టు దగ్గర జరిగింది. ఖేడా జిల్లాలోని మోదాజ్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం గిర్నార్ కొండపై ఉన్న ఆలయాల దర్శనానికి మెట్లు ఎక్కుతుండగా, సమీపంలోని అడవి నుంచి ఒక్కసారిగా ఓ సింహం బయటకు వచ్చి 11 ఏళ్ల బాలుడిపై దాడి చేసింది. కుటుంబ సభ్యులు, ఇతర భక్తులు చూస్తుండగానే బాలుడిని సింహం అడవిలోకి ఈడ్చుకెళ్లింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు.

100 మీటర్ల దూరంలో

గాలింపు సమయంలో ఘటనాస్థలం నుంచి సుమారు 100 మీటర్ల దూరంలో అడవిలో బాలుడి శరీర అవశేషాలను అధికారులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు. ఈ ఘటన అనంతరం గిర్నార్ కొండపై యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తులను మెట్ల మార్గంలో వెళ్లకుండా అటవీ శాఖ అధికారులు ఆపివేశారు. ట్రాకర్లు, అటవీ సిబ్బంది, పశువైద్య బృందాలు సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యల్లో భాగంగా దాడి చేసినట్లు అనుమానిస్తున్న సింహాన్ని సుమారు నాలుగు గంటల్లోనే పట్టుకున్నారు. అదే ప్రాంతంలో సంచరిస్తున్న మరో రెండు సింహాలను కూడా ముందుజాగ్రత్త చర్యగా బంధించి జునాగఢ్‌లోని సక్కర్‌బాగ్ జూకు తరలించారు. పరీక్షల సందర్భంగా అనుమానిత సింహం వాంతులు చేయగా, అందులో బాలుడి శరీర భాగాలు గుర్తించినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో దాడికి పాల్పడింది అదే సింహమనే అనుమానాలు మరింత బలపడ్డాయి. మిగిలిన రెండు సింహాలకు కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఘటనాస్థలం నుంచి సింహం పాదముద్రలు, ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లు సహా పలు కీలక ఆధారాలను అధికారులు సేకరించారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

ప్రముఖ పుణ్యక్షేత్రం గిర్నార్

గుజరాత్‌లోని జునాగఢ్ సమీపంలో ఉన్న గిర్నార్ కొండ పశ్చిమ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన యాత్రా కేంద్రాల్లో ఒకటి. ఇక్కడ అంబాజీ ఆలయం, దత్తాత్రేయ స్వామి ఆలయం సహా అనేక ప్రాచీన హిందూ, జైన దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల దర్శనానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దాదాపు 10 వేల మెట్లు ఎక్కి గిర్నార్ శిఖరానికి చేరుకుంటారు. ఈ ఘటనతో భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.