40 తర్వాత భుజం సమస్యలు పెరుగుతాయి..కారణం ఇదే కావచ్చు
వయసు నలభై దాటిందంటే చాలు.. చాలా మందిలో భుజం నొప్పులు మొదలవుతుంటాయి. చేతులు పైకి ఎత్తాలన్నా, పడుకోవాలన్నా నరకం కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ‘రొటేటర్ కఫ్’ సమస్య కావచ్చు. ఇటీవల మన పవన్ కళ్యాణ్ కూడా అభిమానులు పదేపదే చేతులు లాగడం వల్ల తనకు ఈ భుజం సమస్య వచ్చిందని, దీనికోసం ఆపరేషన్ చేయించుకున్నారు. మరి అసలు ఏంటి ఈ రొటేటర్ కఫ్ గాయం? దీనికి గల కారణాలు, చికిత్సలేంటో ఇప్పుడు చూద్దాం..
రొటేటర్ కఫ్ అంటే ఏంటి?: మన భుజం కీలు (జాయింట్) ఊడిపోకుండా, ఒకే దగ్గర స్థిరంగా ఉంచే కొన్ని ముఖ్యమైన కండరాలు, నరాల సమూహాన్నే ‘రొటేటర్ కఫ్’ అంటారు. ఇక మనం చేతులు తిప్పాలన్నా, బరువులు ఎత్తాలన్నా ఈ కండరాలే మెయిన్ సపోర్ట్. వయసు పెరిగే కొద్దీ, ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారిలో ఇవి సహజంగానే అరిగిపోయే ఛాన్స్ ఉంటుంది.

ఈ సమస్య రావడానికి కారణాలు: క్రీడాకారుల్లో లేదా నిరంతరం చేతులతో ఎక్కువ శ్రమ చేసే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఒక్కసారిగా భారీ బరువులు ఎత్తడం, ప్రమాదవశాత్తు భుజాలకు గాయాలు కావడం వల్ల ఈ కీలులో వాపు వస్తుంది. ఇక ఒక్కోసారి పవన్ కళ్యాణ్‌కు జరిగినట్లు.. ఎవరైనా చేతులను గట్టిగా, పదే పదే లాగడం వల్ల కూడా ఈ కండరాలు చిరిగిపోయే ప్రమాదం ఉంది.
ఎలాంటి లక్షణాలు ఉంటాయి?: ఈ గాయం అయినప్పుడు భుజంలో నిరంతరం నరకం చూపే నొప్పి ఉంటుంది. చేతులు పైకి ఎత్తడం, వీపు వెనక్కి పెట్టడం చాలా కష్టంగా మారుతుంది. రాత్రి పూట నొప్పి మరీ ఎక్కువై నిద్ర కూడా పట్టదు. చేతుల్లో బలం తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.
చికిత్స మార్గాలు ఏంటి?: సమస్య చిన్నదైతే నార్మల్ పెయిన్ కిల్లర్స్ వాడుతూ, డాక్టర్ పర్యవేక్షణలో ఫిజియోథెరపీ చేయడం ద్వారా భుజం నొప్పిని తగ్గించుకోవచ్చు. కానీ కండరాలు పూర్తిగా చిరిగిపోయి, థెరపీతో కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోతే మాత్రం.. చివరి ఆప్షన్‌గా సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అడ్వాన్స్‌డ్ పద్ధతుల్లో దీనికి సులువైన సర్జరీలు అందుబాటులో ఉన్నాయి.
భుజం నొప్పి అనేది కేవలం అలసట వల్ల వచ్చింది అనుకుంటే పొరపాటే. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారు భుజం నొప్పులను లైట్ తీసుకోకుండా, సరైన సమయంలో డాక్టర్‌ను సంప్రదించి ట్రీట్‌మెంట్ తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో సర్జరీల వరకు వెళ్లకుండా కాపాడుకోవచ్చు.
గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందించబడింది. భుజం నొప్పి తీవ్రంగా ఉన్నా లేదా ఎక్కువ రోజులు వేధిస్తున్నా కచ్చితంగా నిపుణులైన ఆర్థోపెడిక్ డాక్టర్‌ను సంప్రదించి తగిన సలహా, చికిత్స తీసుకోండి.
The post 40 తర్వాత భుజం సమస్యలు పెరుగుతాయి..కారణం ఇదే కావచ్చు appeared first on Manalokam – Latest Telugu News & Updates.