Post Office: పోస్టాఫీసుల్లో డబ్బులు డిపాజిట్ లేదా విత్ డ్రా చేస్తున్నారా..? రూల్స్ అన్నీ మారాయ్.. కొత్త నిబంధనలు అమల్లోకి..
దేశంలో పోస్టాఫీసులు ప్రజలకు అనేక సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. బ్యాంకింగ్ సేవలతో పాటు కొరియల్ సేవలను మారుమూల గ్రామాల ప్రజలకు కూడా అందిస్తోంది. పోస్టాఫీసులు చాలా గ్రామాల్లోనూ ఉంటాయి. దీంతో ప్రజలు సులువుగా అక్కడికి వెళ్లి సేవలు పొందుతూ ఉంటారు. అయితే ప్రజలకు మరింత సులువుగా సేవలు అందించేందుకు పోస్టాఫీస్ కీలక నిర్ణయం తీసుకుంది. డిపాజిట్, విత్ డ్రాలను మరింత సులభతరం చేసింది.
ఇక నుంచి పోస్టాఫీసుల్లో నగదు డిపాజిట్ చేయాలన్నా లేదా విత్ డ్రా చేయాలన్నా పేపర్ వర్క్ ఎలాంటిది ఉండదు. ఈ మేరకు పేపర్ లెస్ విధానాన్ని పోస్టాఫీస్ ప్రవేశపెట్టింది. ఇక నుంచి ఆధార్ బయోమెట్రిక్ ద్వారా లావాదేవీలు నిర్వహించనుంది. తాజాగా ఈ కొత్త సదుపాయాన్ని పోస్టాఫీసుల్లో ప్రవేశపెట్టారు. చిన్న మొత్తాల్లో డిపాజిట్, విత్ డ్రాలకు ఆధార్ ఈకేవైసీ సిస్టమ్‌ను తీసుకొచ్చింది.
జూన్ 22వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే కేవలం సింగిల్ ఖాతాలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. మైనర్ లేదా జాయింట్ అకౌంట్లకు ఈ రూల్ వర్తించదు. ఇప్పటివరకు డిపాజిట్ చేయాలంటే డిపాజిట్ స్లిప్పై పేరు, అకౌంట్ నెంబర్, అమౌంట్ వివరాలు రాసి అందించాల్సి వచ్చేది. ఇప్పటి నుంచి ఈ పని తప్పుతుంది. దీని వల్ల వేగంగా ట్రన్సాక్షన్లు చేయవచ్చు.
ఇక నుంచి ఎలాంటి స్లిప్ నింపకుండానే రూ.50 వేల వరకు డిపాజిట్ చేయవచ్చు. అలాగే రూ.20 వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ ట్రన్సాక్షన్లకు మాత్రం పేపర్ వర్క్ అమల్లో ఉంటుంది. అయితే పేపర్ లెస్ విధానంలో ట్రాన్సాక్షన్లు చేయాలంటే తప్పనిసరిగా ఖాతాదారులు ఆధార్ ఈకేవైసీ పూర్తి చేయాలి. ఇది పూర్తి చేస్తే ఏ పోస్టాఫీస్ ద్వారా అయినా నగదు లావాదేవీలు చేయవచ్చు.
ఇక ఆధార్ అనుసంధానం చేయకపోతే అకౌంట్ ఓపెన్ చేసి బ్రాంచులోనే లావాదేవీలు చేయడానికి కుదురుతుంది. ఈ కేవైసీ తప్పనిసరి అని పోస్టాఫీస్ అధికారులు చెబుతున్నారు. ఇక సెప్టెంబర్ 2026 నుంచి డ్రీమ్ యాప్ ద్వారా జరిగే లావాదేవీలకు మొబైల్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి. మొబైల్ నెంబర్ లింక్ చేయకపోతే ఎలాంటి లావాదేవీలు చేయలేరు.




