July 11, 2026

CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొడతాం

CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొడతాం
Reading Time: 2 minutes
Kaleshwaram Revanth Reddy Brs Bjp

CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టు , గోదావరి నీళ్ల తరలింపు అంశంపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీళ్లు ఎత్తిపోయడం లేదంటూ ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రతిపక్షాలు కుట్రపూరిత ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడే మాటలను పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేసిన సీఎం, కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్లను అడ్డం పెట్టుకుని బీఆర్‌ఎస్ తన వాదనను ప్రజలపై రుద్దాలని చూస్తోందని ఆరోపించారు. ఇదే క్రమంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా బీఆర్‌ఎస్ అజెండాను ఎత్తుకోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈటెల పట్ల తనకు గౌరవమే ఉందని, కానీ హరీష్ రావు విజ్ఞప్తి మేరకు ఆయన బీఆర్‌ఎస్ కు అనుకూలంగా మాట్లాడి తన గౌరవాన్ని పోగొట్టుకున్నారని, ప్రభుత్వానికి మంచి సూచనలు చేసి ఉంటే బాగుండేదని హితవు పలికారు.

కేసీఆర్ హయాంలోనే బయటపడ్డ మేడిగడ్డ లోపాలు

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన చారిత్రక వాస్తవాలను సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వివరించారు. 2019 జూన్ 21న అప్పటి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రారంభించగా, ప్రాజెక్టు ప్రారంభించిన కేవలం 11 నెలల్లోనే (18 మే 2020న) మేడిగడ్డ బ్యారేజీలో లోపాలు ఉన్నాయని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధికారులు, ఇంజనీర్ రమణారెడ్డి గుర్తించారని తెలిపారు. కేసీఆరే స్వయంగా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ లోపాలు బయటపడినా, వారి ఘోర నిర్లక్ష్యం మూలంగానే మేడిగడ్డ కుప్పకూలిందని స్పష్టం చేశారు. అలాగే 2022 జూలై 14న వచ్చిన వరదలకు కన్నెపల్లి పంప్‌హౌస్ దెబ్బతిన్నా దాన్ని సరిదిద్దలేదని, అందుకే అది ఇప్పటికీ వినియోగంలోకి రాలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే మహదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో దీనిపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదైందని, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే 2023 అక్టోబర్‌లో ఎన్‌డీఎస్ఏ (NDSA) కమిటీ ఏర్పాటై లోపాలను ఎత్తిచూపుతూ నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు. 2021 డిసెంబర్ 30న ఆమోదం పొందిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ చట్టాన్ని అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వ విధి కాబట్టే ఎన్‌డీఎస్ఏ కమిటీ విజిట్ చేసి, 2026 ఏప్రిల్ 24న ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు.

బ్యారేజీలలో నీటి నిల్వపై ఎన్‌డీఎస్ఏ (NDSA) నిబంధనలు

ఎన్‌డీఎస్ఏ తుది నివేదిక ప్రకారం అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ బ్యారేజీలు ప్రస్తుత స్థితిలో నీటి నిల్వకు పనికిరావని కేంద్ర సంస్థ స్పష్టంగా చెప్పిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. మూడు బ్యారేజీల్లో గేట్లు మూసి నీళ్లు నింపడం కుదరదని, ఎన్‌డీఎస్ఏ , సీడబ్ల్యూసీ (CWC) అనుమతులు లేకుండా ఎలాంటి పనులు లేదా రిపేర్లు చేయవద్దని ఆంక్షలు ఉన్నాయని వివరించారు. “మేడిగడ్డలో 5 టీఎంసీల నీళ్లు నిల్వ చేసే అవకాశం ఉంటేనే నీటిని ఎత్తిపోయగలం. గేట్లు దించకుండా నీటిని ఎలా నిల్వ చేస్తాం? ఒకవేళ గేట్లు దించితే నీళ్లు వెనక్కి కన్నెపల్లికి పోతాయి. అన్నారంలో 107 మీటర్లు, సుందిల్లలో 126 మీటర్ల ఎత్తులో నీటి నిల్వ ఉంటేనే పంపులు పనిచేస్తాయి” అని సాంకేతిక కారణాలను వివరించారు. బీఆర్‌ఎస్ నేతలు మాత్రం ఉన్న ప్రాజెక్టు కొట్టుకుపోయేలా కుట్రలు చేస్తూ, ప్రజల ముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దోషులుగా నిలబెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్‌లకు ఎల్లంపల్లి నుండే నీళ్లు వస్తున్నాయని, కాళేశ్వరానికి మేడిగడ్డ వెన్నుపూస అయితే, ఎల్లంపల్లి గుండెకాయ లాంటిదని పేర్కొన్నారు.

కేంద్రం లేఖ.. ‘కిలాడి కమిటీ’పై విమర్శలు

ప్రాజెక్టు పునరుద్ధరణకు తాము శాయశక్తులా కృషి చేస్తున్నామని, ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం 2026 జూన్ 30న కేంద్ర ప్రభుత్వం ఒక లేఖ రాస్తూ మూడు బ్యారేజీల కోసం కమిటీని ఏర్పాటు చేసిందని సీఎం వెల్లడించారు. ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం నుండి ముగ్గురు ప్రతినిధులను తీసుకోవాలని కేంద్రం సూచించిందని, సాంకేతిక నిపుణుల సాయంతో పునరుద్ధరణ పనులు చేపట్టాలని స్పష్టం చేసిందని తెలిపారు. “మా ముందు ఇప్పుడు రెండు కమిటీలు ఉన్నాయి.. ఒకటి ఎన్‌డీఎస్ఏ వేసిన నిపుణుల కమిటీ, రెండోది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఈటెల సభ్యులుగా ఉన్న ‘కిలాడి కమిటీ’” అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌తో తప్పుడు పనులు చేయించిన రిటైర్డ్ ఇంజనీర్లను ఇప్పటివరకు జైల్లో పెట్టకపోవడమే తాము చేసిన పెద్ద తప్పని, అందుకే శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి వారు ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.