Reading Time: < 1 minute
Vietnam Boat Accident Chandrababu Reaction

వియత్నాంలో జరిగిన పర్యాటక బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు పర్యాటకులు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి మొత్తం 33 మంది వియత్నాం పర్యటనకు వెళ్లగా, వారిలో 19 మంది ప్రమాదానికి గురైన బోటులో ఉన్నారు. ఈ ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన ముడియం శ్రీధర్, కృష్ణా జిల్లాకు చెందిన గెల్లి జయలక్ష్మి, సత్యసాయి జిల్లాకు చెందిన నల్లపేట ఆదిశేషయ్య రవి తేజ మృతి చెందారు. కృష్ణా జిల్లాకు చెందిన గెల్లి కిశోర్ తీవ్ర అస్వస్థతతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారందరూ సురక్షితంగా ఉన్నారు. విహారయాత్రకు వెళ్లిన రాష్ట్రానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

 

ప్రమాదంలో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చూడాలని, ప్రాణాలతో బయటపడిన వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉండాలని, వారికి అవసరమైన సహాయ సహకారాలు వెంటనే అందించాలని సీఎం ఆదేశించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు వియత్నాం ప్రభుత్వ అధికారులు, అక్కడి భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే మృతదేహాలను స్వదేశానికి త్వరితగతిన తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.