టెక్నాలజీ పెరిగేకొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త దారులను వెతుకుతున్నారు. తాజాగా ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో అమాయకులను, ముఖ్యంగా ఉద్యోగ విరమణ చేసిన వృద్ధులను టార్గెట్ చేస్తూ కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారు కూడా ఈ మాయగాళ్ల చేతిలో చిక్కి సర్వస్వం కోల్పోతున్నారు. అస్సలు ఈ డిజిటల్ అరెస్ట్ మోసాలు ఎలా జరుగుతున్నాయి? వీటి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు సులభంగా తెలుసుకుందాం.
గుజరాత్‌లో భారీ దోపిడీ: ఇటీవల గుజరాత్‌లో ఇద్దరు వృద్ధుల నుంచి సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ. 30 కోట్లకు పైగా కొల్లగొట్టడం సంచలనం సృష్టించింది. ఒక రిటైర్డ్ ప్రొఫెసర్‌ను 82 రోజుల పాటు అలాగే ఒక రిటైర్డ్ మహిళా డాక్టర్‌ను 123 రోజుల పాటు వీడియో కాల్స్‌లో భయపెడుతూ డిజిటల్ కస్టడీలో ఉంచారు. వారిని బయటి ప్రపంచంతో మాట్లాడకుండా మానసిక ఒత్తిడికి గురిచేసి విడతల వారీగా ఈ భారీ మొత్తాన్ని నొక్కేశారు.
అసలేంటి ఈ డిజిటల్ అరెస్ట్?: ట్రాయ్ (TRAI) సీబీఐ (CBI) ఈడీ (ED) లేదా పోలీస్ అధికారులమంటూ నేరగాళ్లు బాధితులకు ఫోన్ చేస్తారు. “మీ ఆధార్ కార్డ్ లేదా మొబైల్ నంబర్ చట్టవిరుద్ధమైన పనులకు వాడారు.. విదేశాల నుండి వచ్చిన మీ పార్శిల్‌లో డ్రగ్స్ దొరికాయి” అని నమ్మిస్తారు. ఇక ఆపై విచారణ పేరుతో స్కైప్ లేదా వాట్సాప్ వీడియో కాల్‌లోకి తీసుకువచ్చి, నకిలీ కోర్టు వారెంట్లు చూపిస్తూ డబ్బులు లాగుతారు.

వృద్ధులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?: పదవీ విరమణ చేసిన వృద్ధుల వద్ద లైఫ్ సెటిల్‌మెంట్ డబ్బులు ఎక్కువగా ఉంటాయి. పైగా చాలామందికి ఆధునిక టెక్నాలజీపై పూర్తి అవగాహన ఉండదు.ఇక కొందరు ఒంటరిగా జీవించడం కూడా నేరగాళ్లకు అడ్వాంటేజ్‌గా మారుతోంది. కేవలం వృద్ధులే కాదు హైదరాబాద్ లాంటి నగరాల్లో ఐటీ ఉద్యోగులు, ఉన్నత విద్యావంతులు కూడా ఈ తరహా మోసాల్లో చిక్కుకుంటున్నారు.
నమ్మవద్దు: ముఖ్యంగా కొన్ని జాగర్త లు అవసరం..మొదట గుర్తుతెలియని నంబర్ల నుండి వచ్చే బెదిరింపు కాల్స్, ఐడీ కార్డులు చూసి అస్సలు భయపడకండి.
డబ్బులు పంపవద్దు: ఏ ప్రభుత్వ దర్యాప్తు సంస్థ కూడా క్లియరెన్స్ లేదా వెరిఫికేషన్ పేరుతో పర్సనల్ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు బదిలీ చేయమని అడగదు.
అధికారికంగా చెక్ చేయండి: ఎవరైనా అధికారి అని చెబితే, వెంటనే సదరు ప్రభుత్వ సంస్థల అధికారిక వెబ్‌సైట్ లేదా హెల్ప్‌లైన్ ద్వారా వివరాలు సరిచూసుకోండి.
సమాచారం ఇవ్వండి: ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు భయపడి దాచకుండా, వెంటనే మీ పిల్లలకు లేదా నమ్మకమైన స్నేహితులకు విషయం చెప్పండి.
చట్టంలో ‘డిజిటల్ అరెస్ట్’ లేదు: మన దేశ చట్టాల ప్రకారం ‘డిజిటల్ అరెస్ట్’ అనే ప్రక్రియే లేదు. పోలీసులు లేదా మరే ఇతర దర్యాప్తు సంస్థ అయినా వీడియో కాల్స్ ద్వారా ఎవరినీ నిర్బంధించవు, అరెస్టులు చేయవు. ఇక ఆన్‌లైన్‌లో మిమ్మల్ని ఎవరూ బంధించలేరనే కనీస అవగాహన ఉంటే ఈ మోసాల నుంచి సులభంగా తప్పించుకోవచ్చు.
ఇక సైబర్ నేరగాళ్ల ప్రధాన ఆయుధం ‘భయం’. మిమ్మల్ని మానసికంగా భయపెట్టి లొంగదీసుకోవడమే వారి వ్యూహం. కాబట్టి ఫోన్‌లో బెదిరింపులు రాగానే కంగారు పడకుండా గుండె నిబ్బరంతో ఆలోచించాలి. అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే స్పందించకుండా కట్ చేయడం ఉత్తమం.
The post వృద్ధులపై ఆన్‌లైన్ మోసాలు…అవగాహన అవసరం appeared first on Manalokam – Latest Telugu News & Updates.