Reading Time: 2 minutes
Andhra Techie Venkatesh Doppalapudi Dies Us Kansas Flash Floods

అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. ఆకస్మిక వరదల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందన ఐటీ ఉద్యోగి వెంకటేశ్ దొప్పలపూడి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో సొంత గ్రామం బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

అమెరికాలో శనివారం ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 33 ఏళ్ల ఐటీ నిపుణుడు వెంకటేశ్ దొప్పలపూడి కారు వరద ప్రవాహంలో కొట్టుకుపోవడంతో దుర్మరణం చెందాడు. ప్రస్తుతం వెంకటేశ్ అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రంలోని ఒమాహా నగరంలో నివసిస్తూ హెచ్-1బీ వీసాపై ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం వెంకటేశ్ హ్యూస్టన్‌కు కారులో వెళ్తుండగా కాన్సాస్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. పలుచోట్ల ఆరు అంగుళాలకు పైగా వర్షపాతం నమోదవడంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న కారు వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు ఓ వంతెన సమీపంలో నీటిలో మునిగిపోయిన కారులో వెంకటేశ్ చిక్కుకుపోయినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న సుమ్నర్ కౌంటీ అత్యవసర సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ.. వరద ప్రవాహం తీవ్రంగా ఉండటంతో వెంటనే రక్షణ చర్యలు చేపట్టలేకపోయారు. అనంతరం స్థానిక పోలీసులు, కాన్సాస్ హైవే పట్రోల్ ఎయిర్ యూనిట్, డ్రోన్ల సహాయంతో బహుళ విభాగాల సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టగా.. మరుసటి రోజు వెంకటేశ్ మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు.

ఈ ఘటనపై హ్యూస్టన్‌లోని భారత కాన్సులేట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వెంకటేశ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కాన్సులేట్.. స్థానిక అధికారులతో సమన్వయం చేస్తూ అవసరమైన సహాయం అందిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియలను వేగవంతం చేస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా వెంకటేశ్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి GoFundMe వేదికగా నిధుల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. మృతదేహ రవాణా, అంత్యక్రియలు మరియు ఇతర ఖర్చుల కోసం ఈ నిధులను వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.