
US Woman Shocked: అమెరికాలో అత్యాధునిక వైద్యం లభిస్తుంది, భారత్‌లో ఆరోగ్య మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉంటాయనే వారికి ఈ యూఎస్ మహిళ వీడియోనే కనువిప్పు. అమెరికా, భారత్‌లో మందుల రేట్లపై ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికాలో ఒక ట్యాబ్లెట్ సుమారు 900 డాలర్లు (సుమారుగా రూ. 85,000)లకు లభిస్తుంటే, అదే ట్యాబ్లెట్ భారత్‌లో రూ. 35 నుంచి రూ. 300 మధ్య లభిస్తోందని ఆమె చెప్పారు.
యూఎస్ మహిళ లిజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘‘ఇండియన్ వర్సెస్ అమెరికన్ హెల్త్ కేర్’’ పేరుతో వీడియో పోస్ట్ చేశారు. తన అత్తకు బ్లడ్ క్యాన్సర్ ఉండటంతో Revlimid అనే మందు వాడుతున్నారని, అమెరికాలో దీని ధర రూ. 85,000 ఉంటుందని చెప్పారు. ఇదే ఔషధానికి భారత్‌లో జనరిక్ వెర్షన్ ధర రూ. 35 నుంచి రూ. 300 మధ్య ఉంటుందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారత్‌లో మందులు ఎంతో చౌకగా ఉన్నాయని, ప్రజలకు అందుబాటు ఖర్చుల్లో వైద్యం అందుతోందని లిజ్ వీడియోలో చెప్పారు. అమెరికాలో మాత్రం ప్రజలు మందులు కొనడానికి పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి వస్తోందని అన్నారు. అమెరికన్ ప్రజల్ని దోచుకుంటున్నారని ఆమె చెప్పారు.
లిజ్ పోస్ట్ చేసిన వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. అనేక మంది నెటిజన్లు భారత్‌లో తక్కువ ధరకు లభిస్తున్న జనరిక్ మెడిసిన్స్‌ను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. భారత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత క్యాన్సర్ చికిత్స కూడా లభిస్తోందని పేర్కొన్నారు. ఇటీవల విక్టోరియా అనే యూఎస్ మహిళ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. అమెరికా ఆరోగ్య వ్యవస్థ ఒక స్కామ్ అని ఆరోపించారు. అమెరికాలో 1000 డాలర్లు ఖర్చయ్యే ఔషధాలు, భారత్ నుంచి 25 డాలర్లకే కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు.