
ఉప్పల్ సెంటర్ అంటే ఎంత రద్దీగా ఉంటుందో తెలిసే ఉంటుంది. ఒకవైపు యాదగిరిగుట్ట వెళ్లే భక్తులు, మరోవైపు వరంగల్ హైవే.. దీనికి తోడు మెట్రో కనెక్టివిటీ. ఎప్పుడూ రద్దీగా ఉండే ఉప్పల్ ఏరియాలో బిర్యానీ సెంటర్లకు ఎంత డిమాండు ఉంటుందో చెప్పనవసరం లేదు. అలాంటి చోట.. కస్టమర్లు క్రిక్కెరిసే సెంటర్లో రెస్టారెంట్లు ప్రజల ఆరోగ్యాలను గాలికి వదిలేసి.. డబ్బుకు కక్కుర్తి పడి నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారు. బుధవారం (జులై 01) ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో మాస్టర్ చెఫ్ రెస్టారెంట్లో కనిపించిన దృశ్యాలు అధికారులను షాక్ కు గురిచేశాయి.
ఉప్పల్ మాస్టర్‌చెఫ్ రెస్టారెంట్ ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న రెస్టారెంట్ పై 25 వేల రూపాయలజరిమానా విధించారు. రెస్టారెంట్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.
రెస్టారెంట్ కిచెన్, స్టోర్ రూమ్, డైనింగ్ ఏరియాల్లో ఎక్కడ పరిశుభ్రత పాటిస్తున్నట్లు కనిపించలేదని అధికారులు తెలిపారు. ఈగలు, బొద్దింకలతో చూస్తే యాక్.. అనిపించేలా పరిసరాలు ఉన్నట్లు గుర్తించారు.
►ALSO READ | మీల్ మేకర్స్ ఇష్టంగా తింటారా..! కరీంనగర్ ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తున్నారో చూస్తే..
మాంసాహార పదార్థాలు అపరిశుభ్రమైన స్థలంలో నిల్వ చేసినట్లు చెప్పారు. ఆహార పదార్థాలను మూతలు లేకుండా నిల్వ చేయడంతో బొద్దింకలు, ఈగలు ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు. రిఫ్రిజిరేటర్ల టెంపరేచర్ రికార్డులు నిర్వహించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలిపారు.
ఫుడ్ హ్యాండ్లర్ల వ్యక్తిగత పరిశుభ్రతలో తీవ్ర లోపాలు ఉన్నట్లు గుర్తించారు. మూతలు లేని చెత్త బుట్టల వినియోగంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. స్టోర్ రూమ్ అపరిశుభ్రంగా ఉండటం.. ప్యాలెట్లు లేకుండా ఆహారం నిల్వ చేయడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొన్ని ఆహార పదార్థాలపై తప్పనిసరిగా ఉండాల్సిన లేబుళ్లు లేవని గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. నిబంధనలు పాటించని ఫుడ్ బిజినెస్‌లపై తనిఖీలు కొనసాగుతాయని ఈ సందర్భంగా చెప్పారు. ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.