
- వారి ప్రవర్తన మారకుంటే భవిష్యత్తులో ప్రతిపక్ష హోదా కూడా దక్కదు: మంత్రి పొంగులేటి
- చర్చలకు తమ మంత్రులు వస్తే వారే పారిపోయారని వెల్లడి
- పేదోడికి ఇందిరమ్మ ఇండ్లు అందివ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం
- గోషామహల్, మలక్ పేటలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలు పంపిణీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గూండాగిరికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడేది లేదని రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. గత పదేండ్ల పాలనలో కోట్ల రుపాయలు దోచుకున్న ఆ పార్టీ నేతలు ఇంకా అధికారంలో ఉన్నామని.. మళ్లీ అధికారంలోకి వస్తామనే భ్రమతో మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గురువారం గోషామహల్, మలక్ పేట నియోజకవర్గాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి పొంగులేటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత పదేండ్లలో బీఆర్ఎస్ నేతలు అంటించుకున్న బురదను ఇప్పటి ప్రభుత్వానికి లేదా మంత్రులకు అంటించాలని చూస్తున్నారు.
ఐదేండ్ల పాలనకు ప్రజలు కాంగ్రెస్ కు అధికారమిస్తే మతి భ్రమించి రెండున్నరేండ్లకే గద్దె దిగమని డిమాండ్ చేయడం హాస్యాస్పదం. ఈ రెండున్నరేండ్లలో ఏం జరిగిందో ఎలాంటి తీర్పులు వచ్చాయో రాష్ట్ర ప్రజలకు, దేశానికి తెలుసు. ఏ శాఖ టెండర్ పిలిచినా.. మొత్తం కంటే మూడు నాలుగు రెట్లు అవినీతి జరిగిందని ఆరోపించడం వారి అవివేకానికి నిదర్శనం. వారి ప్రవర్తన కొనసాగితే రానున్న కాలంలో వారికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. మీ సవాల్ ను స్వీకరించి మా మంత్రులు వస్తే.. మీరు రాకుండా పరారయ్యారు. మా మంత్రులు అక్కడే గంట వరకూ వేచి చూసి మీడియాతో మాట్లాడి వచ్చారు” అని మంత్రి అన్నారు.
క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లకు త్వరలో టెండర్లు
క్యూర్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో లక్ష ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే టెండర్లు పిలవనుందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. మరో రెండు మూడు రోజుల్లో స్థల పరిశీలన పూర్తి చేయనున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ‘ప్రతి పేద కుటుంబానికి ఇల్లు’ అనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. క్యూర్ పరిధిలోని 19 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్కో చోట కనీసం 500 నుంచి వెయ్యి ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన ఇండ్ల కంటే కేవలం రెండున్నరేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇండ్లు నిర్మిస్తుందని ఆయన గుర్తు చేశారు.
హైదరాబాద్లో 50 స్థలాల్లో లక్ష ఇండ్లు: మంత్రి పొన్నం
హైదరాబాద్ లో 50 స్థలాలు గుర్తించి లక్ష ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం పెదోడికి ఇందిరమ్మ ఇళ్లు అందివ్వడమేనన్నారు. మూసీ పునరావాసం కింద మునిగిపోయిన వారందరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని మంత్రి పొన్నం గుర్తు చేశారు. ముసారాంబాగ్ లోని అఫ్జల్ నగర్ కమ్యూనిటీ హాల్ లో మలక్ పేట నియోజకవర్గానికి చెందిన 97 మంది లబ్ధిదారులకు మంత్రులు పొంగులేటి, పొన్నం, అజారుద్దీన్, ఎంపీ, ఎమ్మెల్యేలు పట్టాలు పంపిణీ చేశారు. అంతకుముందు గోషామహల్ నియోజకవర్గంలో జాంబాగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద (గతంలో గుండంబా విక్రేతలు) లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను మంత్రులు పంపిణీ చేశారు.