Reading Time: 2 minutes
Chandrababu Launches Vbg Ramji Scheme Unveils Major Rural Development Plans

CM Chandrababu: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో వీబీజీ రామ్‌జీ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా అమలయ్యే ఈ ప్రతిష్టాత్మక పథకం రైల్వే కోడూరు నుంచే ప్రారంభం కావడం గర్వకారణమని అన్నారు. గతంలో నరేగా పథకం రాయలసీమ నుంచే ప్రారంభమై దేశవ్యాప్తంగా విస్తరించినట్లే, ఇప్పుడు వీబీజీ రామ్‌జీ కూడా అదే తరహాలో గ్రామీణాభివృద్ధికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు.

ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.7,700 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.4,000 కోట్లు వెచ్చిస్తోందని చంద్రబాబు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సారథ్యంలో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. 125 రోజుల పనిదినాలతో గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీలు, కాలువలు, వ్యవసాయ మౌలిక వసతులు వంటి పలు అభివృద్ధి పనులను చేపట్టే అవకాశం ఈ పథకం ద్వారా కలుగుతుందని వివరించారు. పథకం అమలులో జియో ట్యాగింగ్, బయోమెట్రిక్ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించి పూర్తి పారదర్శకత పాటిస్తామని సీఎం స్పష్టం చేశారు. గాలేరు–నగరి ప్రాజెక్టు నుంచి కోడూరుకు తాగునీటిని తీసుకురావడంతో పాటు, జలధార కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలను పెంచే చర్యలు కూడా చేపడతామని చెప్పారు.

పవన్ కల్యాణ్‌ నాయకత్వంలో గిన్నిస్‌ రికార్డు..

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ నాయకత్వంలో ఒకే రోజు 13,226 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి గిన్నిస్ రికార్డు సాధించామని చంద్రబాబు గుర్తు చేశారు. గత ఏడాదిలో 7 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 40 వేల గోకులాలు, 15,500 నీటి తొట్టెలు, లక్షకు పైగా ఫార్మ్ పాండ్లు, గిరిజన ప్రాంతాల్లో రహదారులు, లక్షల ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధి వంటి పనులు చేపట్టామని వెల్లడించారు. ఈ ఏడాది 10 వేల కిలోమీటర్ల గ్రావెల్ రోడ్లు, 1,500 కిలోమీటర్ల సిమెంట్, బీటీ రోడ్లు, 500 కిలోమీటర్ల డ్రైన్లు, లక్ష ఎకరాల్లో ఉద్యానవనాల అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

సీఎం కీలక వ్యాఖ్యలు

ముక్కాపారిపల్లెలో జరిగిన సభలో కూడా సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన 93 కేంద్ర పథకాలను తమ ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించిందని చెప్పారు. జల్ జీవన్ మిషన్ సహా పలు పథకాల కోసం రూ.28 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకారం అందిస్తోందని, రాజధాని పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. అమరావతిని ఎవ్వరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి దేశానికి అంకితం చేస్తామని, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడటంతో పాటు రైల్వే జోన్ సాధించామని చంద్రబాబు పేర్కొన్నారు. గూగుల్ డేటా సెంటర్, పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ యూనిట్, తిరుపతిలో బుల్లెట్ మోటార్‌సైకిల్ ప్లాంట్ వంటి భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. రాయలసీమను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

త్వరలో మదనపల్లిలో హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేస్తామని, వేల కోట్ల రూపాయల ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఊపు తీసుకొస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తామని, “వికసిత్ భారత్ – స్వర్ణాంధ్ర” లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రజలు కూడా ఈ అభివృద్ధి యజ్ఞానికి సహకరించాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..