Reading Time: 2 minutes
Mojtaba Khamenei Likely To Skip Ali Khamenei Funeral Security Concerns

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియులు జూలై 4 నుంచి ప్రారంభమై ఐదు రోజుల పాటు జరగనున్నాయి. పవిత్ర స్థలాల దర్శనం అనంతరం జూలై 9న అంత్యక్రియలు చేయనున్నారు. ఇందుకోసం ఇరాన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా ఈ అంత్యక్రియలకు మిత్ర దేశాల ప్రతినిధులను కూడా ఇరాన్ ఆహ్వానించింది. అయితే ప్రస్తుతం సుప్రీం లీడర్, ఖమేనీ కుమారుడు మోజ్తాబా హాజరవుతారా? లేదా? అన్నది సందిగ్ధంగా ఉంది. తాజాగా దీనిపై ఇరాన్ ప్రతినిధి క్లారిటీ ఇచ్చేశారు.

ఖమేనీ అంత్యక్రియలకు ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ హాజరయ్యే అవకాశం లేదని ఇరాన్ సుప్రీం లీడర్ భారత ప్రతినిధి అయతుల్లా హకీమ్ ఎలాహీ తెలిపారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయన భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నందున మొజ్తబాను బహిరంగంగా హాజరుకానివ్వబోరని వెల్లడించారు. ఇటీవల తాను ఇరాన్ వెళ్లినప్పుడు మొజ్తబా ఖమేనీని కలిసిన సన్నిహితులతో మాట్లాడినట్లు చెప్పారు. ‘‘మొజ్తబా ప్రజల మధ్యకు రావాలని, వారిని కలవాలని కోరుకుంటున్నారు. కానీ భద్రతా అధికారులు అందుకు అనుమతించడం లేదు. ప్రస్తుతం పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని, ఆయనకు పూర్తి భద్రత కల్పించడం సాధ్యం కాదని వారు చెబుతున్నారు. అందుకే ఆయన అంత్యక్రియల్లో బహిరంగంగా పాల్గొనే అవకాశాలు చాలా తక్కువ.’’ అని తెలిపారు.

టెహ్రాన్‌లో ఖమేనీ అంత్యక్రియల కోసం ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు, విదేశీ ప్రతినిధులు, ప్రముఖులు చేరుకుంటున్నారు. ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఇటీవల జరిగిన ఘర్షణల అనంతరం ఈ అంత్యక్రియలు జరుగుతుండటంతో దేశవ్యాప్తంగా అప్రమత్తత కొనసాగుతోంది. ఇరాన్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి మాట్లాడిన ఎలాహీ.. ఖమేనీ మరణంతో దేశమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయిందన్నారు. ‘‘ఆయనను ప్రజలు తమ ఆత్మగా, స్ఫూర్తిగా భావించేవారు. ఆయనను ఎవరూ భర్తీ చేయలేరని వారు నమ్ముతున్నారు. ఇది వారికి తీరని లోటు.’’ అని వ్యాఖ్యానించారు.

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టెహ్రాన్ బయలుదేరే ముందు మాట్లాడిన ఆయన.. ఇరాన్‌తో పాటు ఇతర దేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ఖమేనీకి నివాళులర్పించేందుకు వస్తున్నారని తెలిపారు. ‘‘మేమంతా ఆయనకు సంఘీభావం తెలపడానికి, ఆయన చూపిన మార్గంలోనే ముందుకు సాగుతామని చెప్పడానికి అక్కడికి వెళ్తున్నాం.’’ అని అన్నారు.

ఇజ్రాయెల్ మరోసారి ఇరాన్‌పై సైనిక చర్యలకు దిగే అవకాశం ఉందన్న ప్రశ్నకు స్పందించిన ఎలాహీ.. ఇటీవల జరిగిన యుద్ధం తర్వాత కూడా ఇరాన్ మరింత బలంగా నిలిచిందన్నారు. ‘‘ప్రపంచంలోని అనేక దేశాలు ఇరాన్ యుద్ధంలో గెలిచిందని ప్రశంసించాయి. ఇరాన్ ఇప్పటికీ బలంగా ఉంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది.’’ అని స్పష్టం చేశారు.

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడిలో ఖమేనీ హతమయ్యారు. ఖమేనీతో పాటు కుటుంబ సభ్యులు, కీలక నేతలంతా చనిపోయారు. తీవ్ర గాయాలతో మొజ్తబా బయటపడ్డారు. ప్రస్తుతం రహస్య ప్రాంతంలో ఉన్నారు. ఇక జూలై 4 నుంచి 9 వరకు ఖమేనీ అంత్యక్రియలు జరగనున్నాయి. భారత్ నుంచి ప్రధాని మోడీని ఆహ్వానించగా.. బీహార్ గవర్నర్ వెళ్తున్నారు. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్‌కు కూడా ఆహ్వానం అందింది. ఎవరెళ్తున్నారన్నది ఇంకా క్లారిటీ రాలేదు.