
Telangana Cabinet : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. వైద్యం, విద్య, మౌలిక వసతుల కల్పనతో పాటు కేంద్ర ప్రభుత్వ నూతన చట్టాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి పచ్చజెండా ఊపారు. క్యాబినెట్ ఆమోదించిన ప్రధాన తీర్మానాల వివరాలు ఇలా ఉన్నాయి:
కేంద్ర చట్టంపై నిరసన.. జులై 1 నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ అమలు
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సంప్రదించకుండా ఏకపక్షంగా అమల్లోకి తెచ్చిన ‘వీబీ జీ రామ్ జీ’ చట్టంపై రాష్ట్ర మంత్రివర్గం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ కొత్త చట్టం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడుతుందని, ఇది ఫెడరల్ , రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫారసులపై చర్చించారు. ఉపాధి హామీ పథకంలో ఎలాంటి మార్పులు చేయవద్దని గత జనవరిలోనే అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, మరోసారి కేంద్రానికి నిరసన తెలపాలని నిర్ణయించారు. అయితే, ఇతర రాష్ట్రాలన్నీ దీనికి ఆమోదం తెలపడం, ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలనే ఉద్దేశంతో గత్యంతరం లేని పరిస్థితిలో ఈ చట్టాన్ని 2026 జులై 1 నుంచి రాష్ట్రంలో అమలు చేసేందుకు నోటిఫికేషన్ జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. కానీ, ఈ నిబంధనలపై సుప్రంకోర్టులో న్యాయపోరాటం చేయాలని, పార్లమెంట్‌లోనూ కేంద్రాన్ని నిలదీయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
ఉపాధ్యాయులు, సిబ్బందికీ ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజనం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు అందించే అల్పాహారం, పాలు , మధ్యాహ్న భోజనాన్ని ఇకపై వారితో పాటు ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఇతర సిబ్బందికి కూడా అందించాలని కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించే సంకల్పంతో పాటు, భోజన వితరణలో జవాబుదారీతనం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల రాష్ట్రంలో దాదాపు లక్షన్నర మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, పాఠశాల సిబ్బందికి ప్రయోజనం చేకూరనుంది.
టిమ్స్ ఆసుపత్రుల్లో 6,278 ఉద్యోగాల మంజూరు
కొత్తగా అందుబాటులోకి వస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో భారీ ఎత్తున నియామకాలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. సనత్ నగర్, ఎల్.బి.నగర్, అల్వాల్ టిమ్స్ (TIMS) ఆసుపత్రులతో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా మొత్తం 6,278 డాక్టర్లు, వైద్య సిబ్బంది పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో 1,494 రెగ్యులర్ పోస్టులు, 549 కాంట్రాక్ట్ పోస్టులు, 4,235 ఔట్ సోర్సింగ్ పోస్టులు ఉన్నాయి. ఈ ఆసుపత్రులను నిమ్స్ (NIMS) తరహాలో అభివృద్ధి చేయాలని, ఇక్కడ అందించే వైద్య సేవలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి LOC లు కూడా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
మూసీ రివర్ ఫ్రంట్ ఫేజ్-I పనులకు గ్రీన్ సిగ్నల్
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌లో భాగంగా ఫేజ్-I పనులకు మంత్రివర్గం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. తొలి దశలో హిమాయత్ సాగర్ నుంచి ఈసా, ఉస్మాన్ సాగర్ నుంచి మూసా ప్రవాహాలు ప్రారంభమయ్యే చోటు నుంచి బాఫూఘాట్ వరకు 21 కిలోమీటర్ల పొడవునా అభివృద్ధి పనుల కోసం రూ. 7,345.12 కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు పనులు , నిర్వహణ కోసం నూతనంగా 147 పోస్టుల సృష్టికి, అలాగే ఇతర శాఖల నుంచి అవసరమైన సిబ్బందిని డిప్యూటేషన్‌పై తీసుకునేందుకు అంగీకారం తెలిపారు.
గిడ్డంగుల నిర్మాణానికి స్థలాల కేటాయింపు
నిత్యావసర వస్తువుల గోదాముల (Warehouses) నిర్మాణానికి గాను తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (TGSWC) కు మార్కెట్ రేటు ప్రకారం భూములను కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికుంట గ్రామంలో 50 ఎకరాలు, రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కర్కాలపహాడ్ గ్రామంలో 10 ఎకరాల భూమిని కేటాయించనున్నారు.
నవోదయ, కేంద్రీయ విద్యాలయాలకు భూముల కేటాయింపు
రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలకు స్థలాలను కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు కోసం మహబూబ్‌నగర్ జిల్లా పెద్దాయిపల్లి గ్రామంలో 20.18 ఎకరాలు, సూర్యాపేట జిల్లా కోదాడలో 19.12 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. అలాగే, జగిత్యాల జిల్లా చల్‌గల్ గ్రామంలో కొత్తగా కేంద్రీయ విద్యాలయం (Kendriya Vidyalaya) ఏర్పాటుకు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని మంత్రివర్గం తీర్మానించింది.