
IND vs SL Test Series: భారత్, శ్రీలంక జట్ల మధ్య జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్‌ను శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) అధికారికంగా ప్రకటించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్‌లో భాగంగా జరిగే ఈ సిరీస్ ఆగస్టు నెలలో ప్రారంభం కానుంది. శ్రీలంక క్రికెట్ బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. తొలి టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 15 నుంచి 19 వరకు గాల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. రెండో టెస్ట్ ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) మైదానంలో జరగనుంది.
ఈ తేదీలపై ఇప్పటికే పలు మీడియా కథనాలు వచ్చినప్పటికీ.. ఇప్పుడు శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ధృవీకరించడంతో సిరీస్‌కు సంబంధించిన అన్ని సందేహాలకు తెరపడింది. ఈ ఏడాది భారత్‌కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఇవే తొలి మ్యాచ్‌లు కానున్నాయి. గత ఏడాది చివర్లో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ 2-0 తేడాతో పరాజయం పాలైంది. ఆ తర్వాత గత నెలలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికీ.. ఆ మ్యాచ్ WTCలో భాగం కాదు. ఎందుకంటే అఫ్గానిస్థాన్ ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న 9 జట్లలో లేదు.
2017 తర్వాత తొలి టెస్ట్ సిరీస్:
భారత జట్టు 2017 తర్వాత శ్రీలంక గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడడం ఇదే మొదటిసారి. అప్పట్లో విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ శ్రీలంకను 2-0 తేడాతో ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆ సిరీస్‌లో ఆడిన ఆటగాళ్లలో చాలా మంది ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడమే లేదా జట్టు ఎంపికలో లేరు. అయితే కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ మాత్రమే ఆ పర్యటనలో భాగమైన ప్రస్తుత ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు.
T20 సిరీస్‌పై నో క్లారిటీ:
భారత్-శ్రీలంక పర్యటనలో మూడు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా నిర్వహించే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే శ్రీలంక క్రికెట్ బోర్డు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో టీ20 సిరీస్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. దీంతో టీ20 సిరీస్ జరిగే అవకాశాలు తగ్గినట్లు తెలుస్తోంది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నిర్వహణకు ప్రతిపాదన వచ్చినట్లు ధృవీకరించినప్పటికీ.. తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని వెల్లడించారు.
భారత్ బిజీ షెడ్యూల్:
ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లు ఆడుతోంది. ఆ తర్వాత జూలై చివర్లో జింబాబ్వేతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొంటుంది. ఆ తర్వాత శ్రీలంకలో జరిగే ఈ టెస్ట్ సిరీస్ కోసం పర్యటించనుంది. ఇది అయ్యాక సెప్టెంబర్ నెలలో అఫ్గానిస్థాన్‌తో విదేశీ గడ్డపై టీ20 సిరీస్ కూడా భారత్ ఆడనుంది. దీంతో రాబోయే నెలల్లో భారత జట్టు వరుస అంతర్జాతీయ సిరీస్‌లతో బిజీబిజీగా గడిచిపోనుంది.
భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్:
మొదటి టెస్ట్: ఆగస్టు 15-19, గాల్ ఇంటర్నేషనల్ స్టేడియం, గాలే.
రెండో టెస్ట్: ఆగస్టు 23-27, సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC), కొలంబో.