Reading Time: < 1 minute

హైదరాబాద్ బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్పై రైడ్స్.. ఒక్క ఐటమ్ అన్నా కుళ్లిపోకుండా ఉందా అక్కడ !

Caption of Image.

బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్ చైన్ గురించి తెలియని హైదరాబాదీలు ఉండరంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత ఫేమస్ అవి. అక్కడ ఫుడ్ కాస్త ప్రీమియం అయినా.. క్వాలిటీ కోసం కొందరు.. బీబీక్యూ లో తినాలనే సరదాతో కొందరు వెళ్తుంటారు. కొందరైతే ఏకంగా ఇంటికే పార్సిల్ చేసుకుంటుంటారు. కానీ ఈ విషయం తెలిస్తే.. క్వాలిటీ మాయలో ఇలాంటి ఫుడ్ తింటున్నామా..? అనే డౌట్ రాక మానదు. 

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం (జులై 02) రైడ్స్ జరిపారు.  ఉప్పర్‌పల్లి పిల్లర్ నెం.178 వద్ద ఉన్న బీబీక్యూ నేషన్ రెస్టారెంట్‌లో హెచ్-ఫాస్ట్, ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

తనిఖీల్లో కుళ్లిపోయిన, గడువు ముగిసిన చికెన్, మటన్, చేపలు, ప్రాన్స్, కేక్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏ ఐటమ్ చెక్ చేసినా పరిస్థితి అలాగే ఉండటంతో అధికారులు షాకయ్యారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలపై ఉన్న ఎక్స్‌పైరీ తేదీలను మార్చి, కొత్త తేదీలు ముద్రించి వినియోగిస్తున్నట్లు గుర్తించారు. 

►ALSO READ | ఒక్క రెడ్ కార్డ్‌తో రూ.8 కోట్ల పిజ్జాలు ఫ్రీ.. డొమినోస్ బంపర్ ఆఫర్ వైరల్!

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడేలా ఆహార పదార్థాలను నిల్వ చేసి వినియోగిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైందని ఫుడ్ సేఫ్టీ అధికారి సౌమ్య తెలిపారు. ఇలాంటి ఉల్లంఘనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.

గతంలో కూడా ఇదే రెస్టారెంట్‌పై తనిఖీలు నిర్వహించినప్పటికీ యాజమాన్యం తీరులో మార్పు కనిపించలేదని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ఆహార పదార్థాలను ధ్వంసం చేసి, రెస్టారెంట్ యాజమాన్యంపై తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ సందర్భంగా చెప్పారు.  

©️ VIL Media Pvt Ltd.