
హైదరాబాద్, వెలుగు: కోర్టు విధించిన షరతుల ప్రకారం విద్యుత్ కనెక్షన్లు పొంది, ఆ తర్వాత నిబంధనలు అమలు చేయకపోవడం న్యాయస్థానాన్ని మోసం చేసినట్లేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) సమర్పిస్తామని హామీ ఇచ్చి కనెక్షన్లు తీసుకున్నవారు.. ఆ నిబంధన పాటించకపోయినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సిద్దిపేటకు చెందిన ఎన్. కృష్ణమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక బుధవారం విచారించారు.
మున్సిపల్ అనుమతులు ఉన్నా ఓసీ లేదనే కారణంతో విద్యుత్ కనెక్షన్ నిరాకరించడాన్ని పిటిషనర్ సవాల్ చేయగా.. గతంలో ఇచ్చిన హామీని కోర్టు ప్రస్తావించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. ఓసీ వచ్చాకే విద్యుత్, నీరు, మురుగునీటి కనెక్షన్లు ఇవ్వాలని, అనధికార నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. 2017లో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం ఓసీ ఇస్తామన్న హామీతోనే కనెక్షన్ ఇచ్చామని, ఒకవేళ అది తిరస్కరణకు గురైతే సరఫరా నిలిపివేయవచ్చని అప్పుడే చెప్పామని గుర్తుచేసింది. దాదాపు పదేళ్లు గడిచినా ఓసీ సమర్పించకుండానే విద్యుత్ సరఫరా కొనసాగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. తదుపరి విచారణ జరిగే ఈ నెల 15లోగా ఈ నివేదికను సమర్పించాలని టీజీఎస్‌పీడీసీఎల్, టీజీఎన్‌పీడీసీఎల్ చైర్మన్లను హైకోర్టు ఆదేశించింది.