Reading Time: 2 minutes
ఈ ఏడాది ఫోన్ రేట్లు తగ్గుతాయా..? తెరపైకి కొత్త ప్రతిపాదన.. అసలు నిజాలు ఇవే..

గడిచిన కొన్నేళ్లుగా ప్రజలకు స్మార్ట్‌ఫోన్‌లు నిత్యవసర వస్తువుగా మారిపోయాయి. ఆన్‌లైన్ విద్య, డిజిటల్ బ్యాంకింగ్, ఆఫీసు పనులు, వినోదం, ప్రభుత్వ సేవలను పొందడం వంటివన్నీ ప్రస్తుతం మొబైల్ ఫోన్‌లపైనే ఆధారపడి ఉన్నాయి. అయితే ప్రస్తుత మార్కెట్ ట్రెండ్స్ బట్టి చూస్తే.. 2026 నాటికి దేశంలో స్మార్ట్‌ఫోన్ ధరలు తగ్గే అవకాశం ఏమాత్రం లేదని తెలుస్తోంది. దీనికి విరుద్ధంగా, పలు అంతర్జాతీయ పరిణామాలు మొబైల్ ధరలను మరింత పెంచేలా చేస్తున్నాయి. ఒక ఫోన్ తయారీ ధరలో అత్యధిక భాగం దాని ప్రాసెసర్, మెమరీ చిప్‌లు, కెమెరా, డిస్‌ప్లే, బ్యాటరీ వంటి విడిభాగాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇటీవలి కాలంలో మెమరీ చిప్‌ల ధరలు, ముఖ్యంగా ర్యామ్, స్టోరేజ్‌కు సంబంధించిన భాగాల ధరలు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగాయి. ప్రముఖ ఆర్థిక పత్రిక బిజినెస్ స్టాండర్డ్ ఏప్రిల్ 2026 నివేదిక ప్రకారం.. దేశంలో అమ్ముడవుతున్న 80కి పైగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మోడళ్ల ధరలు సగటున 15 శాతం వరకు పెరిగాయి. కంపెనీలకు ఉత్పత్తి వ్యయం పెరగడం, ఆ భారం చివరికి వినియోగదారులపైనే పడుతోంది.

ప్రీమియం ఫోన్లపై మరింత ఒత్తిడి..

ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఈ ధరల ఒత్తిడి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. సరికొత్త అధునాతన ప్రాసెసర్లు, హై ఎండ్ కెమెరా వ్యవస్థలు మరియు అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్ల కారణంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫలితంగా ఈ సంవత్సరం ప్రీమియం ఫోన్‌ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం లేదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

జీఎస్టీ తగ్గించాలంటూ డిమాండ్..

దేశంలో స్మార్ట్‌ఫోన్‌లపై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. అయితే స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు విలాసవంతమైన వస్తువుల జాబితా నుండి నిత్యావసర డిజిటల్ గాడ్జెట్‌లుగా రూపాంతరం చెందాయని మొబైల్ పరిశ్రమల సంఘాలు, ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు ఉపశమనం కలిగించేలా రూ.25,000 లోపు ధర ఉన్న స్మార్ట్‌ఫోన్‌లపై జీఎస్టీని 18 శాతం నుండి 5 శాతానికి తగ్గించాలని వారు ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నారు.

జీఎస్టీ తగ్గితే సామాన్యుడికి ఎంత లాభం?

ప్రభుత్వం గనుక ఈ ప్రతిపాదనను అంగీకరిస్తే.. తక్కువ, మధ్యశ్రేణి స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే లక్షలాది మంది వినియోగదారులకు భారీ ప్రయోజనం చేకూరుతుంది.

ప్రస్తుత పన్ను విధానం: రూ.20,000 ప్రాథమిక ధర కలిగిన స్మార్ట్‌ఫోన్‌పై 18 శాతం జీఎస్టీ విధిస్తే, దాని ఫైనల్ ధర రూ.23,600 అవుతుంది.

ప్రతిపాదిత పన్ను విధానం: ఒకవేళ పన్ను రేటును 5 శాతానికి తగ్గిస్తే, అదే ఫోన్ ధర రూ. 21,000 అవుతుంది. అంటే వినియోగదారుడు నేరుగా రూ.2,600 వరకు ఆదా చేసుకోగలడు. అయితే ఇది ప్రస్తుతానికి కేవలం మొబైల్ పరిశ్రమ వర్గాల నుంచి వచ్చిన ఒక ప్రతిపాదన మాత్రమే. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు.

ఆశాకిరణంగా మారిన ‘మేక్ ఇన్ ఇండియా..

ధరల ఒత్తిడి ఇలా ఉన్నప్పటికీ, భారతీయ కొనుగోలుదారులకు కొంత భరోసాను అందించే సానుకూల సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో భారతదేశం ఒక ప్రధాన స్మార్ట్‌ఫోన్ తయారీ కేంద్రంగా ఆవిర్భవించింది. దేశీయంగా ఉత్పత్తి వేగంగా పెరగడంతో భారత్ ప్రపంచంలోనే అగ్రగామి స్మార్ట్‌ఫోన్ తయారీ దేశాలలో ఒకటిగా నిలిచింది. అనేక అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఇప్పుడు దేశంలోనే ఫోన్‌లను అసెంబుల్ చేస్తూ, తయారు చేస్తున్నాయి. ఈ దేశీయ ఉత్పత్తి వల్ల ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే ఖర్చులు తగ్గి, భవిష్యత్తులో మొబైల్ ధరలు స్థిరంగా ఉండేందుకు దోహదపడనుంది.