
ప్రతి నెలా ఒకటి లేదా ఐదో తేదీ ఎప్పుడొస్తుందా.. అకౌంట్‌లో శాలరీ ఎప్పుడు పడుతుందా అని ఉద్యోగులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ చూస్తుంటారు. అయితే ఈ పాత పద్ధతికి గుడ్ బై చెప్పి, నెలకు 2 సార్లు జీతం ఇస్తే ఎలా ఉంటుంది? ఇదే విషయాన్ని ప్రముఖ వ్యాపారవేత్త, ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ జడ్జ్ అనుపమ్ మిట్టల్ లేవనెత్తారు. శాలరీ ఎప్పుడు ఇవ్వాలి? అంటూ ఆయన గతంలో లింక్డ్‌ఇన్‌లో చేసిన పోస్ట్.. కార్పొరేట్ వర్గాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారి విపరీతంగా వైరల్ అవుతోంది.
నెలకు రెండుసార్లు జీతం..
కంపెనీలు ఫ్రీ ఫుడ్, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి ఆఫర్లు ఇవ్వడం కాదు, ఉద్యోగికి సమయానికి డబ్బులు అందుతున్నాయా లేదా అనేది ముఖ్యం అన్నారు అనుపమ్ మిట్టల్. 15వ తేదీన సగం జీతం, నెల ఆఖరి రోజున మిగతా సగం జీతంఇవ్వడం వల్ల ఉద్యోగులపై ఆర్థిక ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. డబ్బు చేతిలో ఉండటమే ఉద్యోగి ఆత్మగౌరవం. శాలరీ ఒక వారం ఆలస్యమైనా.. అటు రెంట్లు కట్టలేక, ఇటు ఈఎంఐలు బౌన్స్ అయి మిడిల్ క్లాస్ ఉద్యోగులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావని ఆయన అభిప్రాయపడ్డారు
ప్రాక్టికల్‌గా సాధ్యమేనా?
ఈ క్రేజీ ప్రపోజల్‌పై ‘ఇన్క్రూటర్’ సీఈఓ అనిల్ అగర్వాల్ భిన్నమైన ట్విస్ట్ ఇచ్చారు. ఇండియాలో ఈ సిస్టమ్ అంత ఈజీ కాదంటూ కొన్ని లాజికల్ పాయింట్లు లేవనెత్తారు. మన దేశంలో ఇళ్ల అద్దెలు, స్కూల్ ఫీజులు, బైక్ కార్ ఈఎంఐలు అన్నీ నెలవారీ పద్ధతిలోనే ఉన్నాయి. ఒక వ్యక్తికి నెల మొదటి రోజే సగం జీతం ఖర్చు పెట్టే అలవాటు ఉంటే.. జీతాన్ని రెండు ముక్కలు చేసి ఇచ్చినంత మాత్రాన అతని ఖర్చులు తగ్గిపోవు. సమస్య శాలరీ డేట్లలో లేదు.. ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడంలో ఉందని అభిప్రాయపడ్డారు.
కంపెనీలకు పెద్ద తలనొప్పి..
టెక్నాలజీ పరంగా నెలకు రెండుసార్లు జీతం వేయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ భారతదేశంలోని లేబర్ చట్టాలు, పీఎఫ్ కాంట్రిబ్యూషన్లు, గ్రాట్యుటీ, టాక్స్ సిస్టమ్స్ అన్నీ నెలవారీ శాలరీల ఆధారంగానే డిజైన్ అయి ఉన్నాయి. వీటిని మార్చడం హెచ్ఆర్, అకౌంటింగ్ విభాగాలకు పెద్ద టాస్క్ అవుతుంది. పైగా ఇప్పటి యువత జీతం ఎప్పుడు వస్తుందనే దానికంటే.. ప్యాకేజీ ఎంత, కెరీర్ గ్రోత్ ఎలా ఉందనేదే చూస్తున్నారు.
ALSO READ : అధ్యక్ష హోదాలో ట్రంప్ క్రిప్టో బిజినెస్..
వినడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ ‘బై-మంత్లీ’ శాలరీ కాన్సెప్ట్ ఇండియాలోకి రావాలంటే ఎన్నో చట్టపరమైన, సాంకేతిక మార్పులను దాటాల్సి ఉంటుంది. ఏదేమైనా అనుపమ్ మిట్టల్ లేవనెత్తిన ఈ పాయింట్ కొత్త నెల ప్రారంభంలో జీతాలు పడే సమయంలో మరోమారు వైరల్ కావటం ఉద్యోగుల్లో కొత్త ఆశలను, చర్చలను రేకెత్తించింది.