
మన సమాజంలో డాక్టర్లను దేవుడితో సమానంగా చూస్తాం. అయితే ఈరోజు (జూలై 1) నేషనల్ డాక్టర్స్ డే (National Doctors’ Day). ఈ సందర్భంగా.. మన దేశపు మొట్టమొదటి మహిళా డాక్టర్ గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం. సమాజం నుండి ఎన్నో అవమానాలు, విమర్శలు ఎదుర్కొని, మొండి పట్టుదలతో చరిత్ర సృష్టించిన ఆ వీరనారి ఎవరో కాదు.. ఆనందీబాయి జోషి. ఆమె జీవితంలోని గుండెల్ని పిండేసే, స్ఫూర్తినిచ్చే ఇంట్రెస్టింగ్ విషయాలు ఎన్నో ఉన్నాయి… ఆవేంటోయ్ చూద్దామా…
9 ఏళ్లకే పెళ్లి.. 14 ఏళ్లకే డెలివరీ
1865 మార్చి 31న పూణేలోని ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు ఆనందీబాయి, కానీ ఆమె చిన్నప్పటి పేరు యమున. ఆ కాలపు ఆచారాల ప్రకారం, ఆమెకు కేవలం 9 ఏళ్ల వయసులోనే తనకంటే 16 ఏళ్లు పెద్దవాడైన గోపాల్‌రావుతో వివాహం జరిగింది.
ఆ తర్వాత కేవలం 14 ఏళ్ల వయసులోనే ఆమె ఒక పసికందుకు జన్మనిచ్చారు. కానీ, విధి ఎంత విచిత్రమైనదంటే.. సరైన వైద్య సదుపాయాలు లేక ఆ బిడ్డ పుట్టిన 10 రోజులకే కన్నుమూసింది. ఆ చిన్నారి మరణం ఆనందీబాయిని తీవ్రంగా కుంగదీసింది.
బిడ్డ మరణంతో డాక్టర్ కావాలనే సంకల్పం
తన బిడ్డకు సరైన వైద్యం అంది ఉంటే బతికేవాడని ఆనందీబాయి గ్రహించింది. మన దేశంలో వైద్య సదుపాయాలు లేక ఏ తల్లికీ ఇలాంటి గర్భశోకం రాకూడదని, ఎలాగైనా తనే ఒక డాక్టర్ అవ్వాలని ఆ రోజే గట్టిగా నిర్ణయించుకున్నారు.
ALSO READ : ఒక యోధుని అంతరంగం ఆవిష్కరించే.. భగత్ సింగ్ సమగ్ర గ్రంథం
ఆ రోజుల్లో ఒక మహిళ చదువుకోవడమే మహా పాపంగా చూసేవారు. అలాంటిది డాక్టర్ చదువా..? సమాజం, కుటుంబ సభ్యులు ఆమెను తీవ్రంగా విమర్శించారు, వెలివేశారు. కానీ, ఆమె భర్త గోపాల్‌రావు మాత్రం భార్య ఆశయానికి అండగా నిలబడ్డారు.
నగలు అమ్మి.. అమెరికా వెళ్లి..
ఆనందీబాయి చదువు కోసం ఆమె భర్త తన దగ్గరున్న నగలను కూడా అమ్మేశారు. చదువుపై ఉన్న పట్టుదలతో ఆమె ఏకంగా అమెరికాలోని ‘పెన్సిల్వేనియా ఉమెన్స్ మెడికల్ కాలేజీ’లో సీటు సంపాదించారు. కేవలం 19 ఏళ్ల వయసులోనే ‘డాక్టర్ ఆఫ్ మెడిసిన్’ (MD) డిగ్రీ పూర్తి చేసి, భారతదేశపు మొట్టమొదటి మహిళా వైద్యురాలిగా ప్రపంచ రికార్డు సృష్టించారు.
డిగ్రీ పూర్తి కాగానే దేశంపై ఉన్న ప్రేమతో ఆమె భారతదేశానికి తిరిగి వచ్చారు. కొల్హాపూర్‌లోని ‘ఆల్బర్ట్ ఎడ్వర్డ్ ఆసుపత్రి’లో మహిళల వార్డుకు ఇన్‌చార్జ్ డాక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి ఎంతో మంది మహిళలకు సేవలు అందించారు.
కన్నీళ్లను ఆయుధంగా మార్చుకున్న ఆనందీబాయి జోషి కథ.. ఇప్పటి తరం మహిళలకు ఒక గొప్ప ఇన్స్పిరేషన్. డాక్టర్స్ డే రోజున ఆమెను స్మరించుకోవడం మనందరి బాధ్యత!