
“భగవంతుడు సృష్టించిన అనంతమైన ఈ జీవరాశిలో నేనెంత? అనుకునేవారి దరిదాపుల్లో గర్వం ఎంత మాత్రం కనిపించదు. నా అంతటివారు లేరు నా కంటే అధికులు ఉండే అవకాశమే లేదు” అనుకునేవారిని, గర్వమనేది గాఢాంధకారంలా అలుముకుందని అనుకోవాలి. అలాంటివారు. వినయానికీ.. వివేకానికి దూరంగా కనిపిస్తారు.
వికసించిన వినయం తోడైనప్పుడే పరాక్రమం ప్రకాశిస్తుంది. గర్వంతో కూడిన పరాక్రమం అవమానభారంతో నశిస్తుంది. పురాణాలలో.. ఇతిహాసాలలో ఇందుకు నిదర్శనాలు నిర్వచనాలు ఎన్నో కనిపిస్తాయి. అలా తమ శౌర్య పరాక్రమాలను చూసుకుని గర్వంతో మిడిసిపడిన రావణుడు కార్తవీర్యార్జునుడు… పాండ్రక వాసుదేవుడు వంటివారు చివరికి భయపడ్డారు. భంగపడ్డారు.
మహాపరాక్రమవంతుడు.. మేధావి అయిన రావణుడు, ముల్లోకాలలో తనని మించినవాడు లేడనే అహంభావానికి లోనవుతాడు. వీరులుగా పెరెన్నిక గల వారందరితోను యుద్ధం చేసి, వాళ్లను పరాజితులను చేయాలని తహతహలాడుతూ ఉంటాడు. ఎక్కడెక్కడ మహా బలవంతులు ఉన్నారో తెలుసుకుని వెళ్లి మరీ వాళ్లను ఓడించి విజయగర్వంతో విర్రవీగిపోతూ ఉంటాడు. ఆయన సాధిస్తున్న ఒక్కో విజయం ఆయనలోని గర్వాన్ని పెంచుతూ పోతుంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే ఆయనకి వాలి గురించి తెలుస్తుంది..కొండలను పిండి చేయగలవాడు వాలి అలాంటి బలవంతుడిని ఎదిరించి నిలిచినప్పుడే కదా లోకం తన గురించి గొప్పగా చెప్పుకుంటుందని రావణుడు. భావిస్తాడు.
అనుకున్నదే తడవుగా ‘కిష్కింధ’కు వెళతాడు. ‘వాలి’తో యుద్ధం చేయడానికి వచ్చానని అక్కడివారిని భయభ్రాంతులకు గురిచేస్తాడు. సంధ్యావందనం చేసుకోవడానికి ‘వాలి’ సముద్రతీరానికి వెళ్లాడని తెలుసుకుని. అక్కడికి చేరుకుంటాడు. వాలి సంధ్యావందనానికి అంతరాయం కలిగిస్తూ యుద్ధానికి ఆహ్వానిస్తాడు. రావణుడికి గర్వభంగం చేసి తీరవలసిందేనని వాలి నిర్ణయించుకుంటాడు.
రావణుడి మాటల కారణంగా సహనం నశించడంతో ఆయన మెడను తన చంకలో చిక్కించుకుని గుండ్రంగా తిప్పుతాడు వాలి. ఆ వేగానికి రావణుడికి కళ్లు బైర్లుకమ్ముతాయి. అలా రావణుడిని తన బాహువుతో బంధించిన వాలి ఒక్కసారిగా గాల్లోకి ఎగురుతాడు. ఊపిరాడని కారణంగా రావణుడు ఉక్కిరిబిక్కిరి అవుతుంటాడు. అయినా వాలి పట్టించుకోకుండా నాలుగు సముద్రాల మీదుగా ఆయనను తిప్పి తిప్పి కిష్కింధకు తీసుకువస్తాడు. అక్కడ వాలి వదిలివేయడంతో రావణుడు బతికి బయటపడతాడు. అవమానాన్ని దిగమింగుకుంటూ, తప్పనిసరి పరిస్థితుల్లో వాలితో స్నేహం చేసుకుంటాడు.
ఇక దత్తాత్రేయస్వామి వరంతో వేయి చేతులను పొందిన కార్తవీర్యార్జునుడు. ఒక రోజున తన పరివారంతో వేటకు వెళతాడు. అడవిలో అలసిపోయిన కారణంగా జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళతాడు. కామధేనువు అనుగ్రహంతో కార్తవీర్యుడితో పాటు ఆయన పరివారానికి కూడా సమస్త వసతులతో రుచికరమైన భోజనాన్ని జమదగ్ని మహర్షి ఏర్పాటు చేస్తాడు. దాంతో కార్తవీర్యుడు ఆశ్రమంలో ఆ కామధేనువు ఉండటం కంటే, తన అధీనంలో ఉండటమే మంచిదని భావిస్తాడు. అదే విషయాన్ని జమదగ్నితో చెబుతాడు. ఆయన ధోరణి పట్ల జమదగ్ని ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు.
కార్తవీర్యుడు బలవంతంగా కామధేనువును అక్కడి నుంచి తీసుకువెళతాడు. ఆ సమయంలో రేణుకాదేవి కేకలు విన్న పరశురాముడు పరుగుపరుగున వస్తాడు. జరిగింది తెలుసుకుని తల్లిని ఓదార్చుతాడు. మాహిష్మతీ నగరానికి వెళ్లి కార్తవీర్యుడిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. ఒక విప్రకుమారుడు తనతో యుద్ధానికి సిద్ధపడటమా?” అనే గర్వంతో తేలికగా తీసుకున్న కార్తవీర్యుడు. తన సైన్యంతో యుద్ధభూమికి వస్తాడు. భయంకరమైన ఆ యుద్ధంలో తన వేయి చేతులతో పాటు శిరస్సు తెగిపడగా కార్తవీర్యుడు మరణిస్తాడు.
ఇక సాక్షాత్తు భగవంతుడినే పేరు మార్చుకోమన్న వైనం మనకే పౌండ్రక వాసుదేవుడి విషయంలో కనిపిస్తుంది. పౌండ్రకుడి అహంభావం. పతాకస్థాయికి చేరుకుంటుంది. తానే అసలైన వాసుదేవుడినని అందరితో చెప్పుకోవడం మొదలుపెడతాడు. తన పేరుతో ‘ద్వారక’లోని కృష్ణుడు చెలామణి అవుతున్నాడనీ, ఎలాంటి పరిస్థితుల్లోను ఆయన వాసుదేవుడు’ అని పిలిపించుకోవడానికి వీల్లేదని వర్తమానం పంపిస్తాడు. పద్ధతి మార్చుకోకపోతే యుద్ధానికి రమ్మని హెచ్చరికలు జారీ చేస్తాడు. ఆయన వర్తమానం చూసి కృష్ణుడే ఆలోచనలో పడతాడు.మాటలతో చెప్పడం వలన పౌంద్రకుడికి అర్థం కాదని భావించిన కృష్ణుడు, ఆయనకి తన చక్రంతో సమాధానం చెబుతాడు. పౌండ్రకుడు కుప్పకూలిపోతాడు.
భగవంతుడు బాహుబలాన్ని ఇచ్చేది బలహీనులకు సాయపడమని.. వాళ్లకి రక్షణగా నిలబడమని. నిస్సహాయుల పక్షాన నిలిచి వాళ్లకి నీడనీయమని. అంతేకాని తమ గొప్పతనాన్ని నిరూపించుకోవాలనే గర్వంతో వాళ్లను వేధించమని.. పీడించమని కాదు. తాను ప్రసాదించిన బలపరాక్రమాలతో తననే పరీక్షించమని కాదు. తెలివితేటలు… శౌర్యపరాక్రమాలు అధర్మాన్ని ఎదిరించడానికి ఉపయోగించాలేగానీ, అధర్మానికి ఆశ్రయంగా మారడానికి కాదు. గర్వంతో గతి తప్పినవారు ఎవరైనా సరే. చివరికి అవమానాలనే పొందారు.