Reading Time: < 1 minute
Tridha Chowdhury Reveals Aashram Bold Scenes Ended Her Relationship

Tridha: బాబీ డియోల్‌తో కలిసి నటించిన ‘ఆశ్రమ్’ వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి త్రిధా చౌదరి. రీసెంట్ గా ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ఈ సిరీస్‌లో చేసిన బోల్డ్ సీన్స్ కారణంగానే తన లవ్ స్టోరీ ముగిసిందని ఆమె వెల్లడించడం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక పాత్ర కోసం చేసిన నటన ఎలా పర్సనల్ లైఫ్ పై ప్రభావం చూపిందో త్రిధా చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల ఒక పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న త్రిధా చౌదరి, ‘ఆశ్రమ్’ చిత్రీకరణ సమయంలో తన అప్పటి ప్రియుడు దర్శకుడు ప్రకాశ్ ఝాను కలిసి కొన్ని సన్నివేశాలను మార్చాలని కోరినట్లు తెలిపింది. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇలాంటి సన్నివేశాల్లో నటించకూడదని ఆయన చెప్పాడని వెల్లడించింది. తన పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను మార్చించే ప్రయత్నం కూడా చేశాడని ఆమె తెలిపింది. అయితే సిరీస్‌లో చూపించినంతగా బోల్డ్ సన్నివేశాలు నిజంగా లేవని త్రిధా స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆ వెబ్ సిరీస్ విడుదలైన తర్వాత తమ ఇద్దరి మధ్య విభేదాలు పెరిగి చివరకు విడిపోవాల్సి వచ్చిందని తెలిపింది. జీవితంలో కష్టమైన సమయంలో తనకు అండగా నిలవకపోవడం ఎక్కువగా బాధించిందని ఆమె పేర్కొంది.

ఇక బాబీ డియోల్‌తో బోల్డ్ సీన్స్ షూటింగ్  ఎలా జరిగిందనే విషయాన్నీ త్రిధా వివరించింది. ప్రేక్షకులకు తెరపై రొమాంటిక్‌గా కనిపించే ఆ సన్నివేశాల వెనుక మాత్రం చాలా సరదా వాతావరణం ఉంటుందని చెప్పింది. షూటింగ్ సమయంలో తాను డెనిమ్ దుస్తుల్లో క్యారెట్ హల్వా తింటూ ఉండేదాన్నని, కెమెరా ఆన్ అయిన తర్వాత మాత్రమే పాత్రలోకి వెళ్లేదాన్నని నవ్వుతూ గుర్తు చేసుకుంది. ఇప్పటి కాలంలో నటీనటులకు తమ పరిమితుల గురించి మాట్లాడే స్వేచ్ఛ ఉందని కూడా ఆమె చెప్పింది. దర్శకుడు, సహనటుడితో ముందుగానే చర్చించి సన్నివేశాల హద్దులు నిర్ణయించుకోవచ్చని, ఇద్దరి మధ్య పరస్పర గౌరవం, అవగాహన ఉంటే ఇలాంటి సన్నివేశాల్లో నటించడం కష్టమేమీ కాదని అభిప్రాయపడింది. కెరీర్ విషయానికి వస్తే, త్రిధా చౌదరి త్వరలో Aakhri Sawal చిత్రంలో నటుడు సంజయ్ దత్ తో కలిసి కనిపించనుంది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి.