
- కాలేజీ ఫీజు కట్టేందుకు వెళ్తుండగాఘటన
జీడిమెట్ల, వెలుగు: కాలేజీ ఫీజు కట్టేందుకు వెళ్తున్న తల్లీకొడుకులను బొలేరో ఢీకొట్టడంతో తల్లి మృతిచెందింది. కొడుకు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్ బొల్లారం రైల్వే స్టేషన్ సమీపంలోని శాంతినికేతన్ ఎన్‌క్లేవ్‌లో నివసించే గుమ్మడి ఉదయలత(49), ఆమె కొడుకు జి.వేదాంత్ రెడ్డి(22) సోమవారం మధ్యాహ్నం స్కూటీపై బహదూర్‌పల్లికి బయల్దేరారు.
వేదాంత్ రెడ్డి మహీంద్ర యూనివర్సిటీలో చదువుతున్నాడు. కాలేజీ ఫీజు చెల్లించేందుకు ఇద్దరు కలిసి యూనివర్సిటీకి వెళ్తుండగా మార్గమధ్యలో బహదూర్‌పల్లి రుచీ కేఫ్ సమీపానికి చేరుకోగానే వెనుక నుంచి బొలేరో ఢీకొట్టింది. ప్రమాదంలో తల్లి, కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని హాస్పిటల్‌కు తరలించగా ఉదయలత చికిత్స పొందుతూ మృతిచెందింది. వేదాంత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. బొలేరో డ్రైవర్ స్కూటీతో పాటు మరో రెండు వాహనాలను కూడా ఢీకొట్టడంతో మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.