Reading Time: 2 minutes

క్రికెట్ గ్రౌండ్ నుంచి ఫుట్బాల్ స్టేడియంలోకి.. మెస్సీ జెర్సీతో జైస్వాల్ లుక్ వైరల్!

Caption of Image.

Yashasvi Jaiswal Wears Lionel Messi Jersey: భారత స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫుట్‌బాల్ మోజులో మునిగిపోయాడు. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా జట్టు జోర్డాన్‌తో ఆడిన ఫిఫా ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‌ను చూసేందుకు జైస్వాల్ స్వయంగా స్టేడియానికి వెళ్లాడు. ఈ సందర్భంగా అర్జెంటీనా లెజెండ్ లియోనెల్ మెస్సీకి చెందిన ఐకానిక్ నంబర్ 10 వైట్ & బ్లూ జెర్సీని ధరించి మ్యాచ్‌ను ఎంజాయ్ చేశాడు. భారత జట్టులో జైస్వాల్ జెర్సీ నంబర్ 64 కాగా, అతని ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. రౌండ్ ఆఫ్ 32లో మన 64.. ప్రజెంట్ సార్ అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది.

ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌కు నో ఛాన్స్: 
జూలై 14 నుంచి ఇంగ్లాండ్ గడ్డపై జరగబోయే వన్డే సిరీస్‌కు యశస్వి జైస్వాల్‌ను సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. ఇటీవల స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌కి గాయపడిన విరాట్ కోహ్లీ స్థానంలో రీప్లేస్‌మెంట్‌గా వచ్చి జైస్వాల్ సెంచరీతో అదరగొట్టాడు. కాగా హామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా ఆఫ్ఘన్ సిరీస్‌కు దూరమైన కోహ్లీ.. బెంగళూరులో ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తి చేసుకుని ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ద్వారా కమ్‌బ్యాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే జైస్వాల్ ఇప్పటి వరకు ఆడిన 6 వన్డేల్లో 71.25 అద్భుతమైన సగటుతో, 97.60 స్ట్రైక్ రేట్‌తో 285 రన్స్ చేశాడు (2 సెంచరీలు ఉన్నాయి). ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషిస్తూ 16 మ్యాచ్‌ల్లో 427 పరుగులు కొట్టాడు.  

ఏడు మ్యాచ్‌ల్లో గోల్స్.. చరిత్ర సృష్టించిన మెస్సీ: 
మరోవైపు అర్జెంటీనా జట్టు జులై 4న కేప్ వర్డే (Cabo Verde) తో జరగబోయే రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ మ్యాచ్ కోసం మయామి చేరుకుంది. గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచ్‌లో జోర్డాన్‌పై 3–1తో గెలిచిన అర్జెంటీనా.. లీగ్ దశను అజేయంగా ముగించింది. ఈ మ్యాచ్‌లో మెస్సీ రెండు గోల్స్ (Brace) సాధించి ఫుట్‌బాల్ చరిత్రలోనే సరికొత్త రికార్డులను నెలకొల్పాడు. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో వరుసగా 7 మ్యాచ్‌ల్లో గోల్స్ సాధించిన ప్రపంచపు మొట్టమొదటి పురుషుల ప్లేయర్‌గా మెస్సీ రికార్డు సృష్టించాడు.

రొనాల్డో సరసన మెస్సీ: 
1998లో కొత్త ఫార్మాట్ ప్రవేశపెట్టిన తర్వాత.. ఒకే ప్రపంచకప్‌లోని 3 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల్లోనూ గోల్స్ కొట్టిన నాల్గవ ఆటగాడిగా మెస్సీ నిలిచాడు. గతంలో క్రిస్టియానో రొనాల్డో (2018), డేవిడ్ విల్లా (2010), ఫెర్నాండో టోర్రెస్ (2010) మాత్రమే ఈ ఫీట్ సాధించారు. అయితే జోర్డాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ హాఫ్‌లో మెస్సీకి రెస్ట్ ఇచ్చారు. 60వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా గ్రౌండ్ లోకి వచ్చిన అతడు.. 80వ నిమిషంలో తన ట్రేడ్‌మార్క్ ఫ్రీ-కిక్ తో అద్భుతమైన గోల్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ గోల్‌తో ప్రపంచకప్‌లలో మెస్సీ మొత్తం గోల్స్ సంఖ్య 19కి చేరింది. అర్జెంటీనా తరఫున వరల్డ్ కప్‌లో ఆల్-టైమ్ టాప్ స్కోరర్‌గా మెస్సీ తన రికార్డును మరింత సుస్థిరం చేసుకున్నాడు.

©️ VIL Media Pvt Ltd.