Reading Time: < 1 minute

వాట్సప్ ద్వారా సమస్యలు చెప్పినా పరిష్కరించాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు

Caption of Image.

గద్వాల/పెబ్బేరు, వెలుగు:  సాంకేతిక యుగంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, వాట్సప్ ద్వారా సమస్యలు తెలిపినా వాటిని వెంటనే పరిష్కరించాలని పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం గద్వాల కలెక్టరేట్‌‌లో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడుతో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పారదర్శక సేవలు అందించాలని, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు సేవకులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 

ప్రజల కమ్యూనికేషన్ కోసం కలెక్టరేట్‌‌లో హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్లు కేటాయించాలని, వ్యవసాయ సమాచారం కోసం రైతుల వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్డీఎస్, నెట్టెంపాడు పరిధిలోని రిజర్వాయర్ల సామర్థ్యం పెంచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని, అమృత్ పథకం తాగునీటి పనులను సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 9 మంది దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేశారు. అనంతరం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామ రైతు వేదికలో అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధుల విడుదల ప్రత్యక్ష ప్రసారాన్ని ఆయన చూశారు. 

©️ VIL Media Pvt Ltd.