
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఇతర అంశాలపై 23 రాజకీయ పార్టీలు, ఒక స్వతంత్ర ఎంపీ కలిసి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు మంగళవారం లేఖ రాశాయి. సర్ ప్రక్రియ, ఈసీ వ్యవహరిస్తున్న తీరుపై జోక్యం చేసుకోవాలని అందులో కోరాయి.
ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఈ లేఖపై ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలతో పాటు ప్రస్తుతం కూటమికి దూరంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), డీఎంకే కూడా సంతకాలు చేశాయి. సీజేఐకి లేఖ రాయాలని జూన్ 8న జరిగిన ఇండియా కూటమి సమావేశంలోనే నిర్ణయించినట్లు జైరాం రమేశ్పేర్కొన్నారు. ఆ నిర్ణయం మేరకు ఇప్పుడు 23 రాజకీయ పార్టీలు, ఒక స్వతంత్ర ఎంపీ సంతకాలతో లేఖను పంపినట్లు పేర్కొన్నారు.
దీనిపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, లెఫ్ట్ పార్టీల నేతలు, స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ తదితరులు సంతకాలు చేసినట్లు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని మార్గాలు విఫలమైనప్పుడు న్యాయవ్యవస్థే చివరి ఆశ్రయమనే భావనతో చీఫ్ జస్టిస్‌కు లేఖ రాసినట్లు ప్రతిపక్ష నాయకులు చెప్పారు.