
- ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ సోదాలు
- నార్సింగి ఇబ్రహీంబాగ్‌లోని వెస్సెల్లా మెడోస్‌లో విల్లాతో పాటు16 చోట్ల తనిఖీలు
- గచ్చిబౌలి, తెల్లాపూర్, మణికొండ పరిసర ప్రాంతాల్లో కమర్షియల్ కాంప్లెక్సులు
- బెంగళూర్ దగ్గర 45 ఎకరాల వ్యవసాయ భూములు
- ఇంట్లో 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి వస్తువులు స్వాధీనం
- డైరీలో 10 మంది బినామీల పేరిట ఆస్తుల వివరాలు
- ఓ బినామీ ఇంట్లో రూ.40 లక్షల నగదు స్వాధీనం
- ఏసీబీ అదుపులో భీమ్‌రెడ్డి
హైదరాబా
ద్,వెలుగు: అవినీతి అధికారులపై ఏసీబీ దూకుడు పెంచింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అందినకాడికి దోచుకుంటున్న ప్రభుత్వ అధికారుల భరతం పడుతున్నది. వరుసగా నిర్వహిస్తున్న సోదాల్లో బయటపడుతున్న అక్రమాస్తులను చూసి సామాన్యజనం ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా డీజీపీ ఆఫీస్‌లోని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్‌లో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి ఆస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారుల కండ్లు బైర్లు గమ్మాయి.
ఆదాయానికి మించిన ఆస్తుల కూడబెట్టారనే సమాచారంతో గురువారం తెల్లవారుజాము నుంచి ఆయన నివాసం సహా మొత్తం 16 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సైబరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్సులు, బెంగళూర్‌లోదగ్గర్లో 45 ఎకరాలు, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 2 ఎకరాలు, జహీరాబాద్‌లో 3.5 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు లభ్యమయ్యాయి. ఆయన డైరీలో10 మందికి పైగా బినామీల వివరాలను గుర్తించడం విశేషం.
గ్రేటర్ హైదరాబాద్‌లోని పోస్టుల్లో భీమ్‌రెడ్డి హవా
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఆలూరు గ్రామానికి చెందిన సంకిరెడ్డి భీమ్‌రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కీలక పోలీస్ స్టేషన్లు, డివిజన్లలో బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నారాయణగూడ, చిక్కడపల్లిలో ఇన్‌స్పెక్టర్(ఎస్‌హెచ్‌వో)గా, వనస్థలిపురం ఏసీపీగా, పటాన్‌చెరు డీఎస్పీగా పనిచేశారు. గత ప్రభుత్వ హయాంలోని పలువురు నేతలకు భీమ్‌రెడ్డితో దగ్గరి సంబంధాలు ఉన్నట్లు తెలిసింది.
ఈ క్రమంలోనే వనస్థలిపురం, పటాన్‌చెరులో పోస్టింగ్స్ కోసం గతంలో పెద్ద ఎత్తున లాబీయింగ్ జరిగింది. రాజకీయ నేతల అండదండలతో వనస్థలిపురం, పటాన్‌చెరుకు పరిసర ప్రాంతాల్లో సివిల్ వివాదాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో అనేక అక్రమాలకు పాల్పడినట్లు భీమ్‌రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి.
ఇంట్లో 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి, 43 లక్షల నగదు..
భీమ్‌రెడ్డిపై వచ్చిన అవినీతి ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. నార్సింగి వేసెల్లా మెడోస్‌లోని భీమ్‌రెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, బినామీల ఇండ్లలో సోదాలు నిర్వహించింది. తనిఖీల్లో ఆయన ఇంట్లో రూ.3.6 లక్షలు నగదు, రెండు కిలోల బంగారం, 20 కిలోల వెండి ఆభరణాలతో పాటు బినామీ నివాసంలో రూ.40 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. రూ.19.91 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ సీజ్ చేశారు.
వీటితో పాటు సైబరాబాద్‌లోని గచ్చిబౌలి, తెల్లాపూర్, మణికొండలో ఖరీదైన ఆస్తులను గుర్తించారు. రాఘవేంద్ర రాక్ సాండ్ మినరల్స్‌లో రూ. 75 లక్షలు పెట్టుబడికి సంబంధించి డాక్యుమెంట్లను సీజ్ చేశారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రూ.200 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. భీమ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం కోర్టులో హాజరుపరిచి చంచల్‌గూడ జైలులో రిమాండ్‌కు తరలించనున్నారు.
భీమ్‌రెడ్డి ఆస్తుల చిట్టా
- 1. నార్సింగి ఇబ్రహీంబాగ్‌లోని వెస్సెల్లా మెడోస్‌లో విల్లా
- 2. గచ్చిబౌలి టెలికాంనగర్‌లో జీ+2+పెంట్ హౌస్, సాయి ప్రభా రెసిడెన్సీలో ఫ్లాట్
- 3. గచ్చిబౌలి క్రాంతి సియోన్ అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్
- 4. మణికొండ, లాంకోహిల్స్ రోడ్డులో 500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న జీ+5 కమర్షియల్ కాంప్లెక్స్‌లో వాటా
- 5. మణికొండ మర్రిచెట్టు జంక్షన్ సమీపంలో 3000 చదరపు అడుగుల విస్తీర్ణం గల కమర్షియల్ బిట్
- 6. తెల్లాపూర్‌లోని అభినంద రెసిడెన్సీలో రెండు రెసిడెన్సియల్ ఫ్లాట్లు
- 7. ప్రగతి రిసార్ట్స్‌లో 500 చదరపు గజాల ఒక ఖాళీ స్థలం
- 8. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి
- 9. కర్ణాటకలో 44- ఎకరాలు, బెంగళూరులోని దేవనహళ్లిలో 1 ఎకరం భూమి
- 10. నాగోల్‌లోని కామినేని ఆసుపత్రి సమీపంలో 200 చదరపు గజాల ఖాళీ స్థలం
- 11. పటాన్ చెరు జీపీఆర్ హౌసింగ్ సొసైటీ సమీపంలో 400 చదరపు గజాల ఖాళీ స్థలం
- 12. పటాన్‌చెరులో 200 చదరపు గజాల విస్తీర్ణం గల ఒక ఖాళీ స్థలం
- 13. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్‌లో వెయ్యి చదరపు గజాల పార్సెల్ ల్యాండ్ 2 ఎకరాల వ్యవసాయ భూమి,
- 14. రాఘవేంద్ర రాక్ సాండ్ మినరల్స్‌లో రూ. 75 లక్షలు పెట్టుబడి
- 15. శంషాబాద్ ముచింతల సీసీ కుంటలో 4.20 ఎకరాల వ్యవసాయ భూమి