
- ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో హైకోర్టు నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: ఇంజినీరింగ్ కాలేజీల ఫీజుల రీయింబర్స్‌మెంట్‌పై దాఖలైన 100కుపైగా పిటిషన్‌లలో ప్రభుత్వం ఇప్పటివరకు హైకోర్టులో కౌంటరు దాఖలు చేయలేదు. దీంతో ఫీజుల చెల్లింపు మార్గదర్శకాలతో ప్రభుత్వం జారీ చేసిన జీవో 9లోని 4 నిబంధనల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మరోసారి పొడిగించింది. ఫీజుల రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయకపోవడంతోపాటు ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఫీజుల వసూలుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ పలు కాలేజీలు 100కు పైగా పిటిషన్‌లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు.
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.రాహుల్‌రెడ్డి వాదిస్తూ..కౌంటర్లు దాఖలు చేస్తున్నామని, అయితే పిటిషనర్లకు కాపీలు అందజేయడానికి గడువు కావాలని కోరారు. ఈ దశలో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు జోక్యం చేసుకుంటూ.. అలాగైతే గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. కౌంటరు దాఖలు చేయడానికే ప్రభుత్వం ఎక్కువ సమయం తీసుకుంటోందన్నారు. ఫీజులు విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవాలా, ప్రభుత్వం చెల్లిస్తుందా లేదా అన్న అంశంపై కాలేజీలకు ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం ఇబ్బందిగా ఉందన్నారు. అంతేగాకుండా ఫీజు నిర్ధారణ అంశాన్ని కూడా తేల్చాలన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి జులై 6లోగా కౌంటర్లు దాఖలు చేయాలని, వీటికి ఏవైనా రిప్లయ్ ఉంటే దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయన్నారు. కాలేజీల ఫీజు నిర్ధారణ అంశానికి చెందిన పిటిషన్‌లపై కూడా అదే రోజు విచారణ చేపడతామని తెలిపారు.