Reading Time: 2 minutes
Cristiano Ronaldo Bismillah Video Goes Viral Before World Cup Penalty Against Croatia

Cristiano Ronaldo: పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఫిఫా ప్రపంచకప్ 2026 రౌండ్ ఆఫ్ 32లో క్రొయేషియాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా పెనాల్టీ తీసుకునే ముందు రొనాల్డో “బిస్మిల్లా” అని పలికినట్లు కనిపించే వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రపంచవ్యాప్తంగా అభిమానులు విస్తృతంగా షేర్ చేస్తుండటంతో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

టొరంటోలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట క్రొయేషియా తరఫున ఇవాన్ పెరిశిచ్ గోల్ చేసి జట్టుకు ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత పోర్చుగల్‌కు లభించిన కీలక పెనాల్టీని రొనాల్డో విజయవంతంగా గోల్‌గా మలిచి స్కోరును సమం చేశాడు. అయితే పెనాల్టీ తీసుకునే ముందు తనలో తాను ఏదో మాట్లాడుకుంటున్నట్లు వీడియోలో కనిపించింది.

అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్లిప్‌ల ప్రకారం.. రొనాల్డో తన రన్-అప్ ప్రారంభించే ముందు మెల్లగా “బిస్మిల్లా” అనే పదాన్ని రెండు సార్లు పలికినట్లు కొందరు అభిమానులు అంటున్నారు. అరబిక్ భాషలో “బిస్మిల్లా” అంటే “దేవుని పేరుతో” అని అర్థం. ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు ముస్లింలు సాధారణంగా ఈ పదాన్ని ఉచ్ఛరిస్తుంటారు. అయితే రొనాల్డో నిజంగా అదే పదాన్ని పలికాడా లేదా అనేది అధికారికంగా నిర్ధారణ కాలేదు. కానీ పెనాల్టీలు లేదా కీలక సందర్భాల్లో తాను మానసికంగా సిద్ధమవుతూ కొన్ని పదాలను తనలో తాను చెప్పుకోవడం రొనాల్డోకు అలవాటేనని మరికొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ పెనాల్టీ గోల్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ దశల్లో రొనాల్డో సాధించిన తొలి గోల్ ఇదే. దీంతో తన అంతర్జాతీయ కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని అతడు అందుకున్నాడు. అలాగే ప్రపంచకప్ 2026 టోర్నీలో రొనాల్డో చేసిన మూడో గోల్ కూడా ఇదే. అతని గోల్‌తో పోర్చుగల్ మ్యాచ్‌లో తిరిగి పుంజుకోగా.. అదనపు సమయంలో గోన్సాలో రామోస్ చేసిన గోల్‌తో పోర్చుగల్ విజయాన్ని అందుకుంది. ఒకవైపు రొనాల్డో సాధించిన చారిత్రాత్మక గోల్, మరోవైపు ‘బిస్మిల్లా’ వీడియో వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వీడియో ఫుట్‌బాల్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.