
ప్రధాని మోడీ మరో విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. జూలై 6 నుంచి 11 వరకు ఆరు రోజుల పాటు ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు వాణిజ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యం, భారత ప్రవాసులతో సమావేశాలు ప్రధాన అంశాలుగా ఉండనున్నాయి.
40 ఏళ్ల తర్వాత..
ఇక న్యూజిలాండ్‌కు భారత ప్రధాని అధికారికంగా వెళ్లడం 40 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారిగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1986లో న్యూజిలాండ్‌ను సందర్శించారు. ఈ పర్యటనను అధికారికంగా ప్రకటించిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ దీనిని చారిత్రాత్మక పర్యటనగా అభివర్ణించారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి. న్యూజిలాండ్ అభివృద్ధికి కూడా భారత్ కీలక భాగస్వామి.’’’ అని లక్సన్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
ఇటీవల ఇరు దేశాలు భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయని, ఈ ఒప్పందం ఉపాధి, ఎగుమతులు, ఆర్థిక వృద్ధికి ఊతమిస్తుందని తెలిపారు. ఏప్రిల్ 27న భారత్-న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిన తర్వాత మోడీ చేస్తున్న తొలి పర్యటన ఇదే. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి, ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2024 ఆగస్టులో న్యూజిలాండ్‌ను సందర్శించగా.. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ 2025 మార్చిలో భారత్‌లో పర్యటించారు. జూలై 11న ఆక్లాండ్‌లో జరిగే భారతీయుల సభకు 10 వేల మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.
ఇక ఇండోనేషియా పర్యటనలో ప్రధాని మోడీ ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల విస్తరణపై చర్చించనున్నారు. 2025 జనవరిలో ప్రబోవో సుబియాంటో భారత్‌ను సందర్శించి, ఇరు దేశాల దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడమే కాకుండా భారత 76వ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత్ విజయవంతంగా అమలు చేస్తున్న డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నమూనాను ఇండోనేషియాలో అమలు చేయడంపై కూడా ఆసక్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ఆస్ట్రేలియాతో భాగస్వామ్యం
ఇక ఆస్ట్రేలియా పర్యటనలో ప్రధాని మోడీ ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్తో భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత, వాణిజ్యం, ఇండో-పసిఫిక్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరగనున్నాయి. జూలై 9న మెల్‌బోర్న్‌లోని మార్వెల్ స్టేడియంలో నిర్వహించే ‘‘మెల్‌బోర్న్‌లో మోడీ’’ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆస్ట్రేలియా ఇండియా ఫౌండేషన్ నిర్వహిస్తుండగా, విక్టోరియా రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద భారత్-ఆస్ట్రేలియా కమ్యూనిటీ ఈవెంట్‌గా ఇది నిలవనుందని నిర్వాహకులు తెలిపారు.