
ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం రూ.14,115 కోట్ల వ్యయంతో రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్‌లో రవాణా వ్యవస్థను మరింత వేగవంతం చేయడంతో పాటు ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.
ఢిల్లీలో 6-లేన్ల ద్వారకా సొరంగ మార్గం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రాజెక్టును రూ.6,970 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. సొరంగ మార్గం నిర్మాణం పూర్తయితే ఢిల్లీ నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అదే విధంగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నుంచి కబ్రాయ్ వరకు 4-లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ హైవేను రూ.7,145 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. హైవే పూర్తయిన తర్వాత ప్రాంతీయ అనుసంధానం మెరుగుపడటంతో పాటు సరుకు రవాణా వేగవంతం కావడం, పారిశ్రామిక మరియు ఆర్థిక కార్యకలాపాలకు ఊతం లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రయాణికులకు సమయం, ఇంధన వ్యయం తగ్గే అవకాశముందని అధికారులు తెలిపారు. దేశంలో ఆధునిక రహదారి నెట్‌వర్క్‌ను విస్తరించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.