Reading Time: 2 minutes

వైభవ్ తోపే కావొచ్చు.. కానీ అతన్ని ఔట్ చేసేందుకు మా ప్లాన్స్ మాకున్నయ్: హ్యారీ బ్రూక్

Caption of Image.

Harry Brook vs Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్‌ కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టుకు ఇప్పుడు మరో సవాల్ ఎదురుకాబోతుంది. అదే భారత జట్టుతో జరగబోయే టీ20 సిరీస్ సమరం. టెస్ట్ క్రికెట్ హడావుడి ముగిసిన తర్వాత ఇప్పుడు ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈరోజు (జులై 1న) తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. కానీ ఈ సిరీస్ మొత్తంలో అందరి దృష్టి అంతా కేవలం ఒకే ఒక్కడిపైనే ఉంది. అతడే, టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ.. అతడి ఆటను చూడటానికి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు.  

వైభవ్ని ఆడించాలని డిమాండ్: 
బుధవారం (జూలై 1, 2026) భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ కీలక మ్యాచ్‌లోనే వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోవాలంటూ క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కానీ భారత జట్టు యాజమాన్యం మాత్రం తమ వ్యూహాలను బహిర్గతం చేయడం లేదు.. వైభవ్ ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తాడా లేదా అనే అంశంపై ఇంకా క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు.. అయినప్పటికీ, ఇంగ్లాండ్ టీమ్ మాత్రం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేదు. గ్రౌండ్ లోకి దిగకముందే ఆ కుర్రాడిని అడ్డుకోవడానికి ఇంగ్లీష్ టీమ్ తీవ్రంగా కసరత్తులు చేస్తుంది. 

వైభవ్ కోసం ఇంగ్లాండ్ ప్రత్యేక ప్లాన్: 
మంగళవారం (జూన్ 30) జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇంగ్లాండ్ టీమ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మీడియాతో మాట్లాడుతూ.. వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ప్రశ్నకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ చాలా అద్భుతమైన ప్రతిభ కలిగిన ఆటగాడిగా కనిపిస్తున్నాడు. అతడిని మేము తక్కువ అంచనా వేయట్లేదు.. కానీ ఆ 15 ఏళ్ల కుర్రాడిని త్వరగా ఔట్ చేయడానికి మా జట్టు ఇప్పటికే ఒక ప్రత్యేకమైన వ్యూహాన్న రెడీ చేసుకుందని ఇంగ్లీష్ కెప్టెన్ వెల్లడించాడు. 

హ్యారీ బ్రూక్ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా?: 
ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ చెప్పిన ఆ సీక్రెట్ ప్లాన్ ఏంటనేది కేవలం ఇంగ్లీష్ జట్టు ఆటగాళ్లకు మాత్రమే తెలుసు.. కానీ ఈ ప్లాన్లన్నీ మైదానంలో అమలు కావాలంటే ముందుగా వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో తుది జట్టులో చోటు సంపాదించాల్సి ఉంది. ఒకవేళ అతను చేస్టర్-లే-స్ట్రీట్ స్టేడియంలో అడుగు పెడితే గనుక ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించడం తప్పవని క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎందుకంటే ఐపీఎల్ సీజన్‌లో వైభవ్ తన మెరుపు బ్యాటింగ్‌తో ప్రపంచ స్థాయి దిగ్గజ బౌలర్ల వ్యూహాలను సైతం బ్రేక్ చేసేశాడు. మరి ఇరు జట్ల మధ్య జరగనున్న ఈ సమరంలో హ్యారీ బ్రూక్ వేసిన ప్లాన్ వర్క్ అవుతుందో లేదో చూడాలి.  

©️ VIL Media Pvt Ltd.