
నాలుగేళ్లుగా సాగుతోన్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. ఒకరోజు క్రితం కీవ్‌పై రష్యా భారీ క్షిపణి, డ్రోన్ దాడులు జరపగా.. శుక్రవారం కూడా ఇరు దేశాలు పరస్పరం దాడులు కొనసాగించాయి. తాజా దాడుల్లో ఇరు దేశాల్లో కలిపి కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపిన వివరాల ప్రకారం.. రష్యా రాత్రికి రాత్రే 2 క్షిపణులు, 105 డ్రోన్లతో దాడులు చేసింది. మరోవైపు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ.. ఉక్రెయిన్ ప్రయోగించిన 155 డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు రష్యా భూభాగంతో పాటు ఆక్రమిత క్రిమియా ద్వీపకల్పం మీద కూల్చివేసినట్లు ప్రకటించింది.
ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత జపోరిజ్జియా ప్రాంతంలో జరిగిన ఉక్రెయిన్ దాడిలో స్థానిక మార్కెట్ లక్ష్యంగా మారింది. ఈ ఘటనలో ఐదుగురు పౌరులు మృతి చెందగా… మరో మూడు వేర్వేరు దాడుల్లో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ ప్రాంతానికి రష్యా నియమించిన గవర్నర్ యెవ్గెనీ బాలిట్స్కీ తెలిపారు. షాపింగ్ చేస్తున్న సాధారణ ప్రజలనే ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు.
రష్యాలో కూడా ప్రాణనష్టం
రష్యాలోని బెల్గొరోడ్ ప్రాంతంలో ఒకరు, పొరుగున ఉన్న బ్రయాన్స్క్ ప్రాంతంలో మరో వ్యక్తి ఉక్రెయిన్ దాడుల్లో మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ ఈశాన్యంలోని సుమీ ప్రాంతంలో రష్యా దాడి ఓ నివాస ప్రాంతాన్ని తాకింది. ఇల్లు మంటల్లో చిక్కుకోవడంతో రెండేళ్లలోపు చిన్నారి సహా నలుగురు మృతి చెందారు. మృతుల్లో చిన్నారి తల్లి, మరో మహిళ, వృద్ధుడు ఉన్నట్లు గవర్నర్ ఒలెహ్ హ్రిహొరోవ్ తెలిపారు. మరో ముగ్గురు గాయపడ్డారు. అలాగే డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలో జరిగిన మరో రష్యా దాడిలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు.
తాజా దాడులకు ఒకరోజు ముందే రష్యా కీవ్‌పై యుద్ధం ప్రారంభమైన తర్వాత జరిగిన అత్యంత భీకర దాడుల్లో ఒకటిని నిర్వహించింది. 77 క్షిపణులు (వాటిలో 28 బాలిస్టిక్ మిసైళ్లు), వందలాది డ్రోన్లతో రాజధాని కీవ్‌పై దాడి చేసింది. ఈ దాడుల్లో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని 25 ప్రాంతాలు దాడులకు గురయ్యాయి. ముఖ్యంగా నివాస ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 130కు పైగా భవనాలు ధ్వంసమయ్యాయి. 64 అపార్ట్‌మెంట్లు ఉన్న ఓ భవనం పూర్తిగా కూలిపోవడంతో డజన్ల కొద్దీ కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఇంకా పలువురు శిథిలాల కింద చిక్కుకుని ఉండటంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. ‘‘యుద్ధాన్ని ఆపకుండా కొనసాగించేందుకు రష్యా దగ్గర మిగిలింది ఉగ్రవాదమే. కావాలనే పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటోంది.’’ అని ఆరోపించారు. అయితే రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం ఉక్రెయిన్ సైనిక పరిశ్రమలు, ఇంధన మౌలిక సదుపాయాలనే లక్ష్యంగా చేసుకున్నామని.. ఇది ఉక్రెయిన్ దాడులకు ప్రతీకార చర్య అని పేర్కొంది.
రష్యా ఇప్పుడు మరింత వేగవంతమైన Geran-4 జెట్ ఆధారిత డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తోందని ఉక్రెయిన్ వైమానిక దళం వెల్లడించింది. ఈ డ్రోన్లు గంటకు 500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని… గతంలో ఉపయోగించిన షాహెద్ డ్రోన్లతో పోలిస్తే వీటిని కూల్చివేయడం మరింత కష్టమని అధికారులు తెలిపారు. అలాగే కీవ్‌పై జరిగిన దాడిలో జిర్కాన్ హైపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను కూడా రష్యా వినియోగించిందని పేర్కొన్నారు. వీటిని కేవలం పేట్రియట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతోనే అడ్డుకోవచ్చని ఉక్రెయిన్ తెలిపింది.
దాడిలో ప్రయోగించిన క్రూయిజ్ క్షిపణులు, షాహెద్ తరహా డ్రోన్లలో 90 శాతానికి పైగా కూల్చివేసినా, పేట్రియట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణుల నిల్వలు ప్రమాదకర స్థాయిలో తగ్గిపోయాయని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటికే దాదాపు 40 దేశాలకు పేట్రియట్ క్షిపణుల కోసం విజ్ఞప్తులు పంపినట్లు తెలిపింది. ఇరాన్‌కు సంబంధించిన తాజా మధ్యప్రాచ్య ఘర్షణల కారణంగా ఉక్రెయిన్‌కు రావాల్సిన కొన్ని పేట్రియట్ క్షిపణులు ఇతర ప్రాంతాలకు మళ్లించడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందని అధికారులు పేర్కొన్నారు.
అమెరికాకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ (ISW) విశ్లేషణ ప్రకారం.. జూన్ నెలలో రష్యా పెద్ద ఎత్తున డ్రోన్లు, క్షిపణులను నిల్వ చేసి ఇప్పుడు భారీ దాడులు ప్రారంభించినట్లు కనిపిస్తోంది. డ్రోన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటున్న రష్యా.. భవిష్యత్తులో మరింత తరచుగా భారీ వైమానిక దాడులు నిర్వహించే అవకాశముందని, వేగవంతమైన జెట్ డ్రోన్ల వినియోగం పెరగడం వల్ల పౌరుల ప్రాణనష్టం కూడా మరింత పెరిగే ప్రమాదం ఉందని ఐఎస్‌డబ్ల్యూతో పాటు రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.