Reading Time: < 1 minute
ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం.. 17 మందికి గాయాలు

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై గుండెలవిసే ఘోర ప్రమాదం జరిగింది. కొల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారపుర సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక లగ్జరీ బస్సు, వేగంగా దూసుకొచ్చిన ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి రెండు వాహనాల్లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు బస్సును చుట్టుముట్టడంతో, లోపల ఉన్న ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. ఈ భీకర అగ్నిప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు సజీవ దహనమవగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే దౌసా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పీయూష్ దీక్షిత్, అడిషనల్ ఎస్పీ యోగేంద్ర ఫౌజ్‌దార్‌లతో కూడిన భారీ పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. క్షతగాత్రులను అత్యంత వేగంగా ఆసుపత్రికి తరలించేందుకు వీలుగా పోలీసులు ప్రత్యేకంగా ‘గ్రీన్ కారిడార్’ ఏర్పాటు చేశారు. గాయపడిన 17 మందిని దౌసా జిల్లా ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రాథమిక విచారణ ప్రకారం.. ప్రమాద సమయానికి బస్సు విపరీతమైన వేగంతో ప్రయాణిస్తోందని పోలీసులు భావిస్తున్నారు. తెల్లవారుజామున డ్రైవర్ కునుకు తీయడం వల్లే నియంత్రణ కోల్పోయి ట్రక్కును ఢీకొట్టి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఖచ్చితమైన ఆధారాల కోసం ఎక్స్‌ప్రెస్‌వేపై ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు విశ్లేషిస్తున్నారు.

బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతి కావడంతో, లోపల మరికొంత మంది ప్రయాణికులు చిక్కుకుని ఉంటారనే ఆందోళన వ్యక్తమవుతోంది. శిథిలాలను తొలగించి, బాధితులను గుర్తించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పోలీసులు బస్సు ట్రావెల్స్ వివరాలను సేకరించి, బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించే పనిలో నిమగ్నమయ్యారు. ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..