Reading Time: < 1 minute
Us Ohio Motel Fire Gujarat Family Of Three Killed

అగ్ర రాజ్యం అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓహియో రాష్ట్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో గుజరాత్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు ఖేడా జిల్లాకు చెందిన హితేష్‌భాయ్ సుతార్, ఆయన భార్య హీనాబెన్, 20 ఏళ్ల కుమార్తె ఇషానీగా గుర్తించారు. రెండేళ్ల క్రితం కుటుంబం అమెరికాకు వెళ్లి స్థిరపడింది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఓహియో రాష్ట్రంలోని వూస్టర్ నగరంలో ఉన్న ఎకానో లాడ్జ్ (Econo Lodge) మోటెల్‌లో హితేష్‌భాయ్ ఉద్యోగం చేస్తున్నారు. అదే మోటెల్‌లో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున సుమారు 1:30 గంటల సమయంలో మోటెల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో కుటుంబ సభ్యులు వెంటనే మోటెల్ రిసెప్షన్‌కు ఫోన్ చేసి సహాయం కోరారు. బాత్రూమ్‌లో నీటి ట్యాప్‌లు తెరిచి అక్కడే ఉండాలని సిబ్బంది సూచించినట్లు సమాచారం. దీంతో హితేష్‌భాయ్, ఆయన భార్య, కుమార్తె బాత్రూమ్‌లోకి వెళ్లి తలుపు వేసుకుని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు.

అయితే మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఎక్కువ సమయం పట్టడంతో బాత్రూమ్‌లోనే పొగతో ఊపిరాడక ముగ్గురూ మృతి చెందినట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అమెరికా అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక సమాచారం అందుకున్న బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.