
సినిమా లేదా సిరీస్ తీయాలనే బలమైన కోరిక, సరికొత్త కథలు ఉన్నాయా? మీ ఆలోచనలకు దృశ్యరూపం ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నారా? అయితే మీలాంటి తిభావంతుల కోసమే ఓ అద్భుతమైన అవకాశం వచ్చేసింది. ప్రముఖ గ్లోబల్ ఓటీటీ దిగ్గజం ‘నెట్‌ఫ్లిక్స్’ సరికొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు సరికొత్త వేదికను సిద్ధం చేసింది. భారతదేశంలోని ప్రతిభావంతులైన యువ రచయితల కోసం “నెట్‌ఫ్లిక్స్ నెక్స్ట్‌జెన్ ఇండియా రైటర్స్ ప్రోగ్రామ్”ను అధికారికంగా ప్రారంభించింది. తమలోని సరికొత్త ఆలోచనలను, వినూత్నమైన కథలను నేరుగా నెట్‌ఫ్లిక్స్ సంస్థతో పంచుకుని, వాటిని స్క్రీన్ పైకి తీసుకువచ్చేందుకు ఇదొక సువర్ణావకాశం.
ఈ ప్రోగ్రామ్ ముఖ్యంగా పరిశ్రమలోకి అడుగుపెడుతున్న కొత్త రచయితలను ఉద్దేశించి రూపొందించబడింది. స్క్రీన్ రైటింగ్ (కథా రచన) రంగంలో గరిష్టంగా 3 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ అనుభవం ఉన్నవారెవరైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. మీ ఆలోచన సరికొత్తగా ఉండి, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటే చాలు.. మీ కథకు నెట్‌ఫ్లిక్స్ అనే అతిపెద్ద ప్రపంచ వేదిక లభిస్తుంది. మీ కలలను నిజం చేసుకునేందుకు, మీలోని సృజనాత్మకతను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోండి.