
- అధికారికంగా వెల్లడించకముందే సమాచారం ఎలా చేరుతోందని హైకోర్టు ఆగ్రహం
- సమాచార లీకేజీపై 13లోగా నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖకు ఆదేశం
- అధికారుల నిర్లక్ష్య పనితీరుకు అద్దం పడుతోందని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ శాఖలో రికార్డుల భద్రతపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అధికారికంగా వెల్లడించకముందే అంతర్గత సమాచారం సంబంధిత వ్యక్తులకు ఎలా చేరుతోందని ఆగ్రహించింది. ఇలా ఉంటే రికార్డులు తారుమారు అయ్యే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించింది. గద్వాల మండలం మేళ్లచెరువు గ్రామానికి చెందిన భూ వివాదంపై దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, తమ దరఖాస్తుపై ఎమ్మార్వో పంపిన నివేదికను రద్దు చేయాలని కోరారు. మరోవైపు ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ, ఆ నివేదికపై ఆర్డీవో ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు అధికారుల మధ్య జరిగిన అంతర్గత సమాచారానికి సంబంధించిన పత్రాలు అధికారికంగా బయటకు రాకముందే సంబంధిత వ్యక్తులకు ఎలా అందుతున్నాయని ప్రశ్నించారు.
ఇది రెవెన్యూ శాఖ అధికారుల నిర్లక్ష్య పనితీరుకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. అధికారిక నిర్ణయం వెలువడకముందే దరఖాస్తుదారులకు పూర్తి సమాచారం చేరుతోందంటే, శాఖలో సమాచార భద్రత, నియంత్రణ సరిగా లేవని హైకోర్టు అభిప్రాయపడింది. పత్రాలను కాపాడాల్సిన అధికారుల బాధ్యతపై కూడా కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. రెవెన్యూ శాఖలో పత్రాల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు, అంతర్గత సమాచారం బయటకు ఎలా వెళ్తుందనే అంశాలపై ఈ నెల 13లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.