Reading Time: 2 minutes
Government Removes Bat Bms Epoch Li Ion Apps Over E Rickshaw Security Risk

Indian Govt: అప్పటి వరకు బాగానే నడుస్తున్న ఇ-రిక్షా (E-Rickshaw)లు ఒక్కసారిగా ఆగిపోయాయి. దీనికి కారణం కొంత మంది కేటుగాళ్లు చేస్తున్న చెత్త పని. ఇ-రిక్షాలను రన్నింగ్‌లో అకస్మాత్తుగా ఆపేస్తూ కొందరు చేసిన ప్రాంక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు ఇ-రిక్షా కార్మికులు, ప్రజల్లో ఆందోళన రేకెత్తించడంతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) రంగంలోకి దిగింది. ఈ వివాదానికి కారణమైన ‘BAT-BMS’, ‘Epoch Li-ion’ అనే రెండు మొబైల్ యాప్‌లపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని, వాటిని గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ల నుంచి పూర్తిగా తొలగించింది. నిజానికి ఈ వివాదం రేగడానికి చాలా కాలం ముందే ఈ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి ప్రధానంగా బ్యాటరీ డయాగ్నోస్టిక్స్ (పరీక్షించడం), మేనేజ్‌మెంట్ కోసం ఉద్దేశించినవి. ‘BAT-BMS’ అనేది మొదట ఎలాంటి హ్యాకింగ్ టూల్ కాదు. షెన్‌జెన్ గ్రీనెర్జీ టెక్నాలజీ (Shenzhen Grenergy Technology) అనే సంస్థ బ్లూటూత్ సదుపాయం ఉన్న లిథియం-అయాన్ బ్యాటరీల కోసం ఒక చట్టబద్ధమైన కంపానియన్ యాప్‌గా దీన్ని రూపొందించింది. బ్యాటరీ వోల్టేజ్, ఉష్ణోగ్రత (టెంపరేచర్), ఛార్జ్ సైకిల్స్ వంటి ఉపయోగకరమైన సమాచారాన్ని చూపించడం ఈ యాప్ ముఖ్య ఉద్దేశం. అంతేకాదు, అవసరమైనప్పుడు బ్యాటరీ మెయింటెనెన్స్ చేయడానికి, బ్యాటరీ డిస్‌ఛార్జ్ ఫంక్షన్‌ను పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయడానికి సైతం ఇది వినియోగదారులను అనుమతిస్తుంది.

అయితే, ఈ యాప్‌లో ఉన్న ఒక పెద్ద లోపం ఏంటంటే.. బ్లూటూత్ పరిధి అయిన 10 నుంచి 15 మీటర్ల దూరంలో ఉన్న ఎవరైనా సరే, ఎలాంటి పాస్‌వర్డ్ లేదా అథెంటికేషన్ లేకుండానే ఈ యాప్ ద్వారా నేరుగా బ్యాటరీకి కనెక్ట్ అవ్వొచ్చు. ఈ లూప్‌హోల్‌ను కొందరు ఆకతాయిలు తమ ప్రాంక్ వీడియోల కోసం వాడుకున్నారు. ప్రయాణంలో ఉన్న ఇ-రిక్షాల బ్లూటూత్‌కు కనెక్ట్ అయి, ఈ యాప్ సహాయంతో బ్యాటరీని డిస్‌ఛార్జ్ కాకుండా మధ్యలోనే ఆపేశారు. దీంతో డ్రైవర్లు వాహనం ఎందుకు ఆగిపోయిందో తెలియక గందరగోళానికి గురయ్యారు. ఈ వ్యవహారం ప్రయాణికుల భద్రతకు పెద్ద ముప్పుగా మారడంతో పాటు కనెక్టెడ్ వాహనాల్లో (Connected Vehicles) ఉన్న భద్రతా లోపాలను ఎత్తిచూపింది. ఈ క్రమంలో వేగంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం, ఇలాంటి రిస్కీ సాఫ్ట్‌వేర్‌లను మార్కెట్లోకి వదిలే ముందు మరింత కఠినమైన తనిఖీలు (సెక్యూరిటీ చెక్స్) నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి యాప్‌లు ప్లాట్‌ఫామ్‌లపైకి రాకుండా యాప్ రివ్యూ ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీదారులు కూడా తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. బ్లూటూత్ కనెక్టివిటీకి ప్రాపర్ అథెంటికేషన్ (పాస్‌వర్డ్ వంటివి) జోడించడం, బ్లూటూత్ ట్రాఫిక్‌ను ఎన్‌క్రిప్ట్ చేయడం, అనధికారిక యాక్సెస్‌ను నిరోధించేలా ఫర్మ్‌వేర్ అప్‌డేట్‌లను తీసుకురావడం వంటివి చేయాలని కోరుతున్నారు. భారతదేశంలో సరికొత్త ఈవీ టెక్నాలజీని వేగంగా అందుకోవాలనే రేసులో భద్రత వంటి ప్రాథమిక అంశాలను నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి గందరగోళం ఎదురవుతుందో ఈ ఘటన నిరూపించింది. సాంకేతికత దుర్వినియోగం కాకుండా సరైన చేతుల్లోనే ఉండేలా కఠిన నిబంధనలు తీసుకురావడమే ఇప్పుడున్న ఏకైక మార్గం.