Reading Time: 2 minutes
Otr Why Is Ap Home Minister Anita Silent On Sai Krishna Custodial Death Case

OTR: ఆంధ్రప్రదేశ్‌ హోం మంత్రి అనితకు స్టేట్‌లో లా అండ్‌ ఆర్డర్‌ సంగతులు అస్సలు పట్టవా? ఆ ఒక్కటి తప్ప అన్ని విషయాల గురించి ఆమె మాట్లాడేస్తారా? హోం మినిస్టర్‌ డ్యూటీస్‌ అంటే.. పొలిటికల్‌ స్టేట్మెంట్సేనని ఫీలవుతున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌పై ఎందుకు నోరు తెరవడం లేదు? అలాగని ఆదేశాలు ఎవైనా ఉన్నాయా? లెట్స్‌ వాచ్‌.

ఏపీ హోం మినిస్టర్‌ వంగలపూడి అనిత యమా యాక్టివ్‌గా ఉంటారు. పొలిటికల్‌ ప్రత్యర్థులపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతుంటారు. ప్రతిపక్ష నేత జగన్‌ను ఉద్దేశించి పులివెందుల ఎమ్మెల్యే అని సెటైరికల్‌గా మాట్లాడ్డం ఆమెతోనే మొదలైందని చెప్పుకుంటాయి రాజకీయవర్గాలు. అంతవరకు సరే.. రాజకీయ వ్యవహారాల్లో ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. కానీ, మంత్రి హోదాలో ఉండి సంబంధింత శాఖ వ్యవహారాల గురించి పట్టించుకోకుండా అనిత కేవలం పొలిటికల్‌ స్టేట్‌మెంట్స్‌కే పరిమితం అవుతున్నారా అన్నది చాలా మందికి వస్తున్న లేటెస్ట్‌ డౌట్‌.

ఎందుకంటే.. రాష్ట్రాన్ని కుదిపేసిన సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసుపై హోం మినిస్టర్‌ సక్రమంగా స్పందించలేదన్నది రాజకీయవర్గాల విస్తృతాభిప్రాయం. ఆ వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు ఒకే ఒక్కసారి స్పందించారామె. అదీ కూడా కేవలం ఐదు సెకన్ల రియాక్షన్‌. సాధారణంగా పొలిటికల్ స్టేట్‌మెంట్స్‌ విషయంలో అనర్గళంగా మాట్లాడే అనిత అత్యంత కీలకమైన కేసు విషయంలో కేవలం ఐదు సెకన్లకే ఎందుకు పరిమితం అయ్యారన్నది బిగ్‌ క్వశ్చన్‌. రాష్ట్ర హోం మంత్రిగా అంత సీరియస్‌ సమస్య మీద సరిగా స్పందించకపోవడంపై వివిధ వర్గాల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట.

కస్టోడియల్‌ డెత్‌ కేసు విషయంలో ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ మంత్రే మాట్లాడ్డం లేదా? లేక స్పందించవద్దని ఆమెకు ఆదేశాలున్నాయా అన్న చర్చలు సైతం పెరుగుతున్నాయి. ఇదే విషయాన్ని విపక్షాలు సైతం నిలదీస్తున్నాయి. అత్యంత ముఖ్యమైన కేసు విషంలో హోం మంత్రి స్పందన అత్యంత పేలవంగా ఉండటం ఏంటి? హోం మంత్రి నోరు కట్టేస్తోంది ఎవరో తేల్చాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు. ఈ కేసుకు సంబంధించి హోం మంత్రి రియాక్షన్‌పై రాజకీయవర్గాలతో పాటు సామాన్యుల్లో సైతం రకరకాల డౌట్స్‌ పెరుగుతున్నాయట.

రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి ఒకరు హోం మినిస్టర్‌ మేకప్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే.. అంతా ఖండించారు. అలాంటిది ఒక ప్రాణం విషయంలో ఆ స్థాయి స్పందన లేకపోవడం ఏంటన్న మాటలు వినిపిస్తున్నాయి. పై నుంచి వచ్చిన ఆదేశాలతోనే అనిత అలా వ్యవహరిస్తున్నారా అన్న సందేహాలు చాలామందిలో వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో సంబంధిత మంత్రికంటే ఎక్కువగా ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ స్పందించారు. అయినాసరే ఆమె నుంచి నో రియాక్షన్‌ అంటే… దీన్నెలా అర్ధం చేసుకోవాలంటూ క్వశ్చన్‌ మార్క్‌ ఫేస్‌ పెడుతున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో చాలామంది ఇప్పుడు డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను కోట్ చేస్తున్నారట. నేనే హోమ్ మంత్రి అయిఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదని పవన్ వ్యాఖ్యానించడం..అనిత విషయంలో సరిగ్గా సరిపోతుందా అనే చర్చలు సైతం నడుస్తున్నాయి. పవన్‌కళ్యాణ్‌ ఏ ఉద్దేశ్యంతో అలాంటి వ్యాఖ్యలు చేశారోగానీ.. వాతావరణం మాత్రం అలాగే కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు కొందరు.
కారణం ఏదైనాసరే.. రాష్ట్రంలో ఇంత పెద్ద ఘటన జరిగితే హోమ్ మంత్రి నోరు మెదపక పోవడం మాత్రం తీవ్ర చర్చనీయాంశం అయింది.