
టాలీవుడ్‌లో సరికొత్త జాంబీ జానర్‌ను పరిచయం చేసి భారీ విజయాన్ని అందుకున్న ‘జాంబీ రెడ్డి’. తేజా సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పార్ట్ 2′ షూటింగ్ సైలెంట్ గా అధికారికంగా ప్రారంభమైంది. అంతేకాకుండా సినిమాకు సంబంధించిన అత్యంత కీలకమైన మొదటి షెడ్యూల్ చిత్రీకరణను కూడా చిత్రబృందం విజయవంతంగా పూర్తి చేసుకుంది.
ఈ సీక్వెల్‌కు బాలీవుడ్ డైరెక్టర్ సుపర్ణ్ వర్మ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. గతంలో నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన పాపులర్ వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుపర్ణ్ వర్మ, ఈ సినిమాతో డైరెక్టర్ గా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మొదటి భాగాన్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఈ పార్ట్ 2 కి కేవలం కథ మాత్రమే అందిస్తుండటం విశేషం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఐడియాలజీతో రాబోతున్న ఈ కథలో మరిన్ని ఆసక్తికరమైన ఎలిమెంట్స్ ఉండబోతున్నాయట. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ, ప్రముఖ నటుడు సంజయ్ కపూర్ కుమార్తె షనాయా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌తో టాలీవుడ్‌లోకి ఫీమేల్ లీడ్‌గా అడుగుపెడుతుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అత్యున్నత సాంకేతిక విలువల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌ను పంచడం ఖాయంగా కనిపిస్తోంది. మిరాయ్ తర్వాత తేజా సజ్జా నటిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.