
ఓటీటీ ప్రియులకు అలరించేందుకు సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘ఇసకపట్నం'( Isakapatnam) డిజిటల్ ప్లాట్ ఫామ్ పై రచ్చ చేసేందుకు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 2, 2026 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, నటుడు సముద్రఖని ప్రధాని పాత్రలో నటించారు. డైరెక్టర్ గ్యారీ బీహెచ్ ఈ వెబ్ సిరీస్ ను ఒక ఎమోషనల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్లుగా రూపొందించారు. ఇది తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అందుబాటులోకి ఉంది.
కథేంటంటే..
1990ల నాటి కోస్తా తీర ప్రాంతం బ్యాక్‌డ్రాప్‌లో, క్రైమ్.. పాలిటిక్స్.. బిజినెస్ ల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 1985లో గ్యాంగ్ వార్స్, రాజకీయ అశాంతితో రగిలిపోతున్న ‘ఇసకపట్నం’ అనే ఫిక్షనల్ పోర్ట్ టౌన్‌లోకి అడుగుపెడతాడు నాయుడు (సముద్రఖని). దౌర్జన్యాలు, హత్యలతో చూస్తూ చూస్తూనే ఆ ప్రాంతానికి తిరుగులేని డాన్‌గా ఎదుగుతాడు. అయితే, అతడి సామ్రాజ్యానికి సవాల్ బయటి నుంచి కాదు, సొంత ఇంటోంచే ఎదురవుతుంది. నాయుడు కూతురు భారతి (ఐశ్వర్య రాజేష్) తండ్రి చేసే రక్తపాతాన్ని, నేర సామ్రాజ్యాన్ని తీవ్రంగా అసహ్యించుకుంటుంది. కన్నతండ్రి సృష్టించిన అరాచక కోటను బద్దలు కొట్టేందుకు ఆమె ఎదురుతిరుగుతుంది. ఈ క్రమంలో తండ్రీకూతుళ్ల మధ్య ఎలాంటి మైండ్ గేమ్ సాగింది? వెన్నుపోట్లు, ప్రతీకారాల మధ్య ‘ఇసకపట్నం’ సింహాసనాన్ని ఎవరు దక్కించుకున్నారనేదే అసలు కథ.
ఎలా ఉందంటే?
‘ఇసకపట్నం’ బ్యాక్‌డ్రాప్, పోర్ట్ టౌన్ సెటప్, డాన్ వర్సెస్ కూతురి ఘర్షణ అనే పాయింట్ వినడానికి చాలా క్రేజీగా ఉంది. సిరీస్‌లో విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి. కాకపోతే, ఇంతటి భారీ పోర్ట్ టౌన్ నేపథ్యం ఉన్నా.. కథ ఎక్కువగా ఇళ్లు, పోలీస్ స్టేషన్లు, సీక్రెట్ హైడౌట్లకే పరిమితమైందన్న విమర్శలు వస్తున్నాయి. నాయుడు క్యారెక్టర్ బిల్డప్ బాగున్నా, అతడు అంత పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడనే ఎస్టాబ్లిష్‌మెంట్ సీన్లు మరింత బలంగా ఉంటే బాగుండేది టాక్. టైమ్‌లైన్ పరంగా కొన్ని కన్ఫ్యూజన్లు ఉన్నప్పటికీ.. సిరీస్ నిండా ఉండే ట్విస్టులు, వైలెన్స్, ప్రతీకారేచ్ఛ క్రైమ్ లవర్స్‌ను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా చివరి రెండు ఎపిసోడ్లలో వచ్చే ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్ సీన్లు హైలైట్‌గా నిలుస్తాయి.
నటీనటుల పర్ఫార్మెన్స్ ..
నాయుడు పాత్రలో సముద్రఖని తన రఫ్ అండ్ రూథ్‌లెస్ యాక్టింగ్‌తో భయపెట్టారు. అయితే, అన్నిటికంటే భిన్నమైన, లేయర్స్ ఉన్న పాత్రలో ఐశ్వర్య రాజేష్ అద్భుతంగా నటించింది. తిరుగుబాటు చేసే కూతురిగా, క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునే మహిళగా భారతి పాత్రలో ఆమె నటన సిరీస్ కు పెద్ద ప్లస్ గా నిలిచింది.. వీరితో పాటు సునీల్, నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమాకుల, రాజీవ్ కనకాల, రాజా చెంబోలు, బెనర్జీ, మైమ్ గోపి, రోహిణి, రవి వర్మ తమ పాత్రల పరిధి మేర మెప్పించారు.
తమాడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాహుల్ తమాడా, సాయిదీప్ రెడ్డి బొర్రా నిర్మించిన ఈ సిరీస్‌కు ప్రశాంత్ రాగతి కథ అందించగా, తాజుద్దీన్ సయ్యద్ పవర్‌ఫుల్ డైలాగ్స్ రాశారు. రా అండ్ రస్టిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలను ఇష్టపడేవారు ఈ వీకెండ్‌లో ‘ఇసకపట్నం’ వెబ్ సిరీస్ పై ఒక లుక్కేయొచ్చు..