Reading Time: 2 minutes
Gold: 1 గ్రాము గోల్డ్ ఆభరణాల్లో అసలు బంగారం ఉండదా..? చాలామందికి తెలియని సీక్రెట్ ఇదే..

బంగారం ధరలు ప్రస్తుతం తగ్గుతున్నాయి. గత మూడు వారాలుగా భారీగా డౌన్ అవుతున్నాయి. ప్రస్తుతం తులం బంగారం రూ.1.40 లక్షల వద్ద కొనసాగుతోంది. గత ఏడాది కాలంలో బంగారం ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో బంగారం కొనుగోలు చేసేవారు కూడా తగ్గిపోగా.. సేల్స్ ఒక్కసారిగా పడిపోయాయి. ఈ సమయంలో తక్కువ ధర ఉన్న 1 గ్రాము బంగారం బాగా పాపులర్ అవుతోంది. రూ.లక్షలు ఖర్చు పెట్టి బంగారం కొనుగోలు చేయలేనివారు ఒక గ్రాము గోల్డ్ జ్యువెలరీ కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇందులో నిజంగా బంగారం ఉంటుందా.. లేదా అనే విషయం చాలామందికి తెలియదు. ఇందులో బంగారం ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. మరి ఏముంటుందనేది ఒకసారి చూద్దాం.

ఈ లోహాలతో తయారుచేస్తారు

1 గ్రాము బంగారంలో 1 శాతం బంగారం ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పు. 1 గ్రాము బంగారు ఆభరణాలను రాగి, ఇత్తడి, వెండితో తయారుచేస్తారు. ఈ లోహలతో తయారుచేసినవాటికి కేవలం బంగారం రంగు పూస్తారు. దీనిని చూస్తే అచ్చం బంగారంలానే కనిపిస్తుంది. కానీ అది కేవలం పొర మాత్రమే. ఈ ఆభరణాలు ఎలక్ట్రోప్లేటింగ్ లేదా గోల్డ్ ఫాయిల్ లేయరింగ్ ద్వారా తయారుచేస్తారు. దీంతో 1 గ్రాముల బంగారు ఆభరణాల్లో గోల్డ్ ఉంటుందని ఎవరైనా చెబితే అసలు నమ్మవద్దు. ప్రస్తుతం 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ. 14 వేలుగా ఉంది. బయట ఆన్‌లైన్‌లో రూ.79 నుంచి రూ.500లోపు 1 గ్రాము బంగారు ఆభరణాలను విక్రయిస్తున్నారు. దీంతో ఇవి నిజమైన గోల్డ్ కాదు అని అర్థం చేసుకోవాలి.

లాజిక్ మర్చిపోవద్దు

1 గ్రాము గోల్డ్ ఆభరణాల్లో 1 గ్రాముల గోల్డ్ పొర వేసినా దాని ధర రూ.10 వేలు ఉండాలి. ఈ లాజిక్ ఎవరు తెలుసుకోకుండా 1 గ్రాము బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఇది నిజమైన బంగారం కాదు కనుక తిరిగి అమ్మాలంటే ఎవరూ కొనుగోలు చేయరు. అసలైన బంగారాన్ని మాత్రమే ఎవరైనా కొనుగోలు చేస్తారు. దీంతో 1 గ్రాము బంగారానికి రీసేల్ వాల్యూ ఉంటుందని ఎవరైనా చెబితే అసలు నమ్మకండి. అయితే వీటిని చూడటానికి అచ్చం బంగారంలాగే ఉంటాయి కాబట్టి ఎక్కువమంది ఇటీవల కొనుగోలు చేస్తున్నారు. ధర కూడా తక్కువగా ఉండటంతో పండుగలు, పంక్షన్ల సమయంలో ఉపయోగించుకోవచ్చనే ఉద్దేశంతో కొంటున్నారు. వివిధ డిజైన్లతో ఇవి లభిస్తున్నాయి. దొంగతనం జరుగుతాయనే భయం కూడా ఉండదు. అయితే ఈ బంగారాన్ని రోజు వాడితే పొర చెరిగే అకకాశముంటుంది. దీంతో ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే దీనిని ఉపయోగించాలి.